
- ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై హైకమాండ్‌కు సీనియర్ల ఫిర్యాదు
- ఈసారి టికెటి ఇవ్వొదంటూ డిమాండ్
- హైదరాబాద్ లో నేతల మకాం
- అసంతృప్తులకు వేణుగోపాలచారి సపోర్ట్
నిర్మల్, వెలుగు : ముథోల్ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు రోజురోజుకు బయట పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నిన్నటి వరకు ముథోల్ బీఆర్ఎస్లోనూ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పైన ఎలాంటి అసంతృప్తి, అసమ్మతి లేదనుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత నర్సాగౌడ్ తన అనుచరగణంతో ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలువడం ఇక్కడి రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో అసమ్మతి వర్గం నేతలు హైదరాబాద్‌లో మకాం వేసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. వీరి వెనక మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి పరోక్షంగా అండదండలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసమ్మతి నేతలెవరంటే...
ఇప్పటికే ముథోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్, బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్, మాజీ ఎంపీపీ సాయిబాబా, ముథోల్, బాసర మండలాల కీలక నాయకులంతా ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పార్టీలో చేరేందుకు కలిశారు. తాజాగా భైంసా జడ్పీటీసీ దీపా తండ్రి సోలాంకీ భీంరావు, బాసర జడ్పీటీసీ వసంత భర్త సౌంవ్లీ రమేష్,
భైంసా మాజీ జడ్పీటీసీ నీలాబాయి రాంకిషన్, తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ పండిత్ రావు పటేల్, సీనియర్ లీడర్ మధుకర్, విఠల్‌లు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది సర్పంచులు, ఎంపీటీసీలు సైతం ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.
కొత్త వారికి ఇవ్వాలంటూ..
మొన్నటివరకు ముథోల్ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తిరుగు లేదని అంతా అనుకున్నారు. అంతలోనే సదరు అసమ్మతి లీడర్లు పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించి కొత్త వారికి టికెట్టు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికే వీరంతా భారీ నీటి పారుదల అభివృద్ధి శాఖ చైర్మన్ వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు తో పాటు మరికొంత మంది లీడర్లను కలిశారు.
ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి టికెట్టు ఇస్తే తాము సపోర్టు చేయబోమని, లేదని పార్టీ ఫిరాయింపులే శరణ్యం చెప్పినట్లు తెలిసింది. అదే విధంగా శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్‌ను సైతం వారు కలుస్తున్నట్లు తెలిపారు.
నేతలను పట్టించుకోకపోవడంతోనే...
కాగా.. అసమ్మతి నేతలంతా హైదరాబాద్‌లో ఉంటే.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాత్రం సెగ్మెంట్లోనే ఉన్నారు. ఈ నేతలంతా ఎమ్మెల్యేకు పలు విషయాలపై సమస్యలు చెప్పుకోచ్చిన పట్టించుకోకపోవడం కారణమంటున్నారు. బాసర ట్రీపుల్‌ఐటీలో మెస్ కాంట్రాక్టర్లను మార్చాలని, భైంసా హాస్పిటల్లో సలహా మండలి కమిటీ వేయాలని, కుభీర్ మార్కెట్ కమిటీ, బాసర ఆలయ కమిటీ పాలకవర్గాలను నియమించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అన్ని మండలాల్లో తమకు వ్యతిరేకంగా మరో వర్గాన్ని ప్రోత్సహించడం సహా సెగ్మెంట్లో పార్టీని నాశనం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వోద్దంటూ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఏదీ ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి అసమ్మతి నేతలతో తలనొప్పి ఉంటుందంటున్నారు.