- అశ్వారావుపేట సీఐ, కానిస్టేబుల్స్
- కారణమంటూ కంప్లయింట్
- జీరో ఎఫ్ఐఆర్ నమోదు..ట్రాన్స్ఫర్
అశ్వారావుపేట, వెలుగు : ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి హైదరాబాద్ లోని మలక్‌పేట్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత కేసును మహబూబాబాద్ పీఎస్ కు ఫార్వర్డ్ చేశారు. కృష్ణవేణి కథనం ప్రకారం అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ సుభాని, శేఖర్, సన్యాసినాయుడు, శివ నాగరాజు కలిసి డబ్బుల కోసం సివిల్ కేసులు నమోదు చేయాలంటూ తన భర్తను ఇబ్బందులు పెట్టారన్నారు.
క్రైమ్ మీటింగ్ లో సీఐ జితేందర్ రెడ్డి ఫైల్స్ ను ముఖంపై విసిరి కొట్టి కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. తన భర్త నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో డేటాను భద్రపరచాలని కోరారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన సీఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను మహబూబాబాద్ పీఎస్‌కు ఫార్వర్డ్ చేశారు.