
- ముత్తిరెడ్డి అనుచరుడిపై పోలీస్ స్టేషన్ లో పల్లా వర్గీయుడి ఫిర్యాదు
- రాజేశ్వర్ రెడ్డి పరువుకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపణ
- స్టేషన్కు పిలిచి విచారించిన టౌన్ సీఐ
- వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పోస్టులు పెట్టవద్దని హెచ్చరిక
- హీట్ పెంచుతున్న జనగామ పాలిటిక్స్
జనగామ, వెలుగు : జనగామ బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ రాజకీయం వేడెక్కిస్తోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ తీవ్రమైంది. ఒకరిపై ఒకరు మాటల దాడి, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల దాడి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్ పై పల్లా అనుచరుడు కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి గురువారం రాత్రి జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
రాఖీ పండుగ రోజు పల్లా పరువుకు భంగం కలిగించేలా విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. దీంతో విజయ్ను స్థానిక పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్ కు పిలిపించి విచారించారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించి పంపించారు.
రాఖీ రాజకీయంపై ఆగ్రహం
రాఖీ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా గురువారం హైదరాబాద్లోని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. ఈ క్రమంలో పల్లా పేరుతో ఉన్న స్వీట్ బాక్సులను పలువురు లీడర్లకు పంచారని ముత్తిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ‘‘ఇన్నాళ్లు జనగామ మహిళలు పల్లాకు గుర్తురాలేదా? పట్టభధ్రుల ఓట్లతో గెలిచిన పల్లా ఏనాడూ జనగామకు రాలేదు. సొంత అక్క భూమిని కబ్జాచేసిన ఆయనకు ఇప్పుడు ఆడబిడ్డలు గుర్తొచ్చారా? ఈ స్వీట్ల రాజకీయం ఏమిటి?” అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్ పోస్టులు పెట్టాడు.
గత కొన్ని రోజులుగా పల్లా అనుచరులు ఆయనను కీర్తిస్తూ పోస్టులు, స్టేటస్లు పెట్టుకుంటుంటే.. ముత్తిరెడ్డి అనుచరులు మాత్రం పల్లాను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో పల్లా అనుచరులు జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది.
పల్లాపై అట్రాసిటీ కేసు పెట్టాలి
తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించడంపై తిప్పారపు విజయ్ స్పందించారు. తనపై పల్లా అనుచరులు కేసు పెట్టడం దళితులపై దాడిగా ఆయన పేర్కొన్నారు. దళితుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి మనోవేదనకు గురిచేయించినందుకు పల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తనకు ప్రాణ భయం ఉందని, టికెట్ రాక ముందే బెదిరింపులు ఉంటే తరువాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్ రెడ్డి పలుమార్లు ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని విజయ్ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
పిలిపించి మాట్లాడిన
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తిప్పారపు విజయ్ పై కేశిరెడ్డి రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విజయ్ ను పిలిచి విచారించాం. అనుచిత పోస్టులు పెట్టవద్దని చెప్పి పంపించాం. కేసు నమోదు చేయలేదు.
- శ్రీనివాస్, జనగామ టౌన్ సీఐ