కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై ఆడిట్ చేయాలని కాగ్​కు ఫిర్యాదు

కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై ఆడిట్ చేయాలని కాగ్​కు ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్​అని వైఎస్సార్ టీపీ చీఫ్​ షర్మిల ఆరోపించారు. స్కామ్​లో  కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి పట్టపగలే లక్ష కోట్లు దోచుకున్నారని ఫైరయ్యారు. సెంట్రల్​ ఫైనాన్స్ కార్పొరేషన్స్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులొచ్చాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్​పై విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కాగ్  డైరెక్టర్ గిరీశ్​చంద్ర ముర్ము ను కలిసి  ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు, అవినీతి జరిగిన తీరుపై వివరించి ఆడిట్ చేయాలని కోరారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు కానీ.. ఖర్చు మాత్రం మూడింతలు పెరిగిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై అన్ని ఆధారాలు సమర్పించామని, ఇరిగేషన్ నిపుణులతో కమిటీ వేసి దర్యాప్తు జరుపుతామని కాగ్ హామీ ఇచ్చినట్టు షర్మిల చెప్పారు. సెంట్రల్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ అయిన.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్,  నాబార్డుతోపాటు ఇతర సంస్థల నుంచి  రూ.97,500 కోట్లు తీసుకొని ప్రాజెక్టు కట్టారన్నారు. అందుకే ఇది జాతీయ స్థాయి స్కామ్​ అని, కేంద్ర సంస్థలతోనే  దర్యాప్తు చేయాలన్నారు.  

మునుగోడు ఉప ఎన్నికను బహిష్కరించాలె

మునుగోడు ఉప ఎన్నికను ప్రజలు బహిష్కరించాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజల కోసంగానీ, ప్రజలు కోరితే గానీ ఈ ఎన్నిక రాలేదన్నారు. స్వార్థంకోసం తెచ్చిన ఎన్నిక కోసం కోట్లు ఖర్చు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన సోదరి సునీతకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిన్నాన్నను హత్య చేసిన వాళ్లకు శిక్ష పడాలన్నారు.