హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయనకు వెంటనే చికిత్స అందించి రక్షణ కల్పించాలని వీణవంక మండలానికి చెందిన గెల్లు రాజేందర్ యాదవ్.. జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ప్రచారం చివరి రోజున కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని, హుజూరాబాద్ నియోజకవర్గ ఒటర్లను ఇది భయభ్రాంతులకు గురిచేయడమే అని రాజేందర్ పేర్కొన్నారు. ఆయన మానసిక స్థితి సరిగా లేనందునే అలా మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కౌశిక్‌తో పాటు ఆయన భార్య, కూతుర్లకు రక్షణ కల్పిచాలని కోరారు. కౌశిక్ రెడ్డికి మానసిక చికిత్సని అందించాలని, ఆయనకు ఏదైనా జరిగితే ఎన్నికల అధికారులే బాధ్యత వహించాలని రాజేందర్ అన్నారు.