హెల్త్ సెక్రటరీపై మంత్రికి ఫిర్యాదు

హెల్త్ సెక్రటరీపై మంత్రికి ఫిర్యాదు
  •     తనను అవమానించారని ఓ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ ఆరోపణ
  •     ఆయన లేకుండానే రివ్యూ చేసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు :  ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నడుమ పంచాయితీ, ఆ శాఖ మంత్రికి ఫిర్యాదులు చేసుకునే వరకూ వెళ్లింది. స్టేట్ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తరచూ తనను అవమానిస్తున్నారని ఆరోగ్యశాఖలోని ఓ విభాగానికి హెచ్‌‌‌‌‌‌‌‌వోడీగా ఉన్న డాక్టర్.. మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి కార్యాలయ అధికారులు ఈ ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పనితీరు, బ్లడ్ బ్యాంకుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌పై గురువారం సెక్రటే రియట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి రాజనర్సింహ రివ్యూ చేశారు. దీనికి ముందు ఆరోగ్యశాఖలో పలు విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలు హెల్త్ సెక్రటరీని సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లోని ఆమె చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిశారు. 

ఆమె బ్లడ్ బ్యాంకుల పని తీరుపై ఒక్కొక్కరినీ ఆరా తీశారు. తన వద్ద బ్లడ్ బ్యాంకుల సమాచారం ఏదీ లేదని ఓ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ చెప్పడంతో సెక్రటరీ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమాచారం లేకుండా రివ్యూకు ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రివ్యూకు అటెండ్ కావాల్సిన అవసరం లేదని, తిరిగి ఆఫీసుకు వెళ్లి ఇతర పనులు ఉంటే చూసుకోవాలని బయటకు పంపించేశారు. ఈ మొత్తం వ్యవహారం జరిగేటప్పుడు సెక్రటరీ ఆఫీసులో పనిచేసే అధికారులు, సిబ్బంది, మిగిలిన విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలు కూడా అక్కడే ఉన్నారు. 

దీంతో అవమానంగా ఫీలైన సదరు డాక్టర్, అక్కడి నుంచి ఆగ్రహంగా బయటకొచ్చి నేరుగా వెళ్లి మంత్రిని కలిశారు. జరిగిన వ్యవహారం మొత్తాన్ని వివరించారు. అనంతరం బ్లడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులపై రివ్యూకు అటెండ్ అవకుండానే సదరు హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ సెక్రటేరియట్ నుంచి వెనుదిరిగారు. ఆయన లేకుండానే మంత్రి బ్లడ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులపై సమీక్ష కూడా చేశారు.