నల్గొండ మున్సిపాలిటీ టెండర్లపై కలెక్టర్ కు కంప్లయింట్

నల్గొండ మున్సిపాలిటీ టెండర్లపై కలెక్టర్ కు కంప్లయింట్

నల్లొండ మున్సిపాలిటీలో టెండర్లలో జరుగుతున్న బాగోతం ఇదీ అంటూ ఓ కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ కు కంప్లయింట్ చేయటం కలకలం రేపుతోంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 80 లక్షల విలువ చేసే వీధి దీపాల టెండర్లకు మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ టెండర్ల ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టడం ఏంటి అంటూ.. కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు కొందరు కాంట్రాక్టర్లు. పెద్ద పెద్ద కంపెనీలు అయిన బజాజ్, సూర్య కంపెనీల లైట్లు మాత్రమే పెట్టాలనే రూల్స్ పెట్టటం అనుమానాలకు తావీస్తోందని కలెక్టర్ కు ఇచ్చిన కంప్లయింట్ లో స్పష్టం చేశారు కాంట్రాక్టర్ కె.దిలీప్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంలో నల్గొండ మున్సిపాలిటీలో చర్చనీయాంశం అయ్యింది. 

ALSO READ | తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీఎన్నికల నగారా

నల్గొండ మున్సిపాలిటీలో వరసగా కాంట్రాక్టులు దక్కించుకుంటున్న ఓ బడా కాంట్రాక్టర్ కు అనుకూలంగానే ఈ టెండర్ల ప్రక్రియ జరుగుతుందని.. ఓ వ్యక్తికి లబ్ది చేకూర్చటానికే ఇలాంటి నిబంధనలు పెడుతున్నారనేది చిన్న కాంట్రాక్టర్ల వాదన. ఆ బడా కాంట్రాక్టర్ తో నల్గొండ మున్సిపల్ అధికారులు కుమ్మక్కయ్యారని పలువురు చిన్న కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. రూల్స్ ప్రకారం 11 కంపెనీల లైట్లకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నల్గొండ మున్సిపాలిటీలోనే రెండు పెద్ద కంపెనీలకే అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ ఎలక్ట్రికల్ కంపెనీలకు డీలర్ కావడం వల్లే ఇలా జరుగుతుందని.. ఈ విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని.. తప్పించుకుని తిరుగుతున్నారని మిగతా కాంట్రాక్టర్లు అంటున్నారు. 

నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్న టెండర్ల గోల్ మాల్, టెండర్ల బాగోతంపై  ఓ కాంట్రాక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ కు కంప్లయింట్ చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.