అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !

అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !
  • అయ్యప్ప సొసైటీలో 684 గజాల స్థలంలోభారీ బిల్డింగ్
  • గతంలోనే కూల్చేయాలని కోర్టు, జీహెచ్ఎంసీ ఆదేశాలు
  • సీఎం రేవంత్​ రెడ్డికి ,హైడ్రాకు కంప్లయింట్

హైదరాబాద్, వెలుగు: అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రాకు కంప్లయింట్స్ పెరుగుతున్నాయి. తాజాగా, ఎలాంటి అనుమతి లేకుండా చేపడుతున్న 9 అంతస్తుల భారీ భవన నిర్మాణంపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. మున్సిపల్​ శాఖ అధికారులు హెచ్చరించినా, కోర్టు ఆదేశాలు ఉన్నా ఈ నిర్మాణం చేపడుతున్నారు. శేర్ లింగంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖానామెట్ గ్రామంలో సర్వే నంబర్​ 11/5, ప్లాట్ నంబరు 5/13లో ఉన్న అయ్యప్ప సొసైటీలో నిర్మాణం జరుగుతోంది.

 సొసైటీలోని 684 గజాల స్థలంలో 100 అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ ఆనుకుని ఈ నిర్మాణం చేపట్టడంపై కంప్లయింట్ అందింది. కనీసం అడుగు కూడా సెట్ బ్యాక్ వదలకుండా ఈ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణమే అక్రమంటే.. ఏకంగా 9 అంతస్తుల భవనాన్ని అడ్డగోలుగా కడుతున్ననట్టు గుర్తించారు. . 

జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చినా ఆగని నిర్మాణం..

వాస్తవానికి ఈ అక్రమ నిర్మాణంపై గతంలోనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ కట్టడాన్ని కూల్చివేయాలని గతేడాది ఫిబ్రవరి 2వ తేదీన భవన నిర్మాణదారుడికి అధికారులు షోకాజు నోటీసు ఇచ్చారు. 15 రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయినా నిర్మాణదారు నుంచి ఎలాంటి రిప్లై  రాలేదు. దీంతో అదే నెల 26వ తేదీన 15 రోజుల వ్యవధిలో భవనం కూల్చివేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయినా లెక్కచేయలేదు. 100 అడుగుల రోడ్డులో అండర్​ పాస్​ ఎదురుగా నిర్మాణం జరుగుతున్న ఈ అక్రమ కట్టడంపై కొంత మంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా భవనం కూల్చివేయాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ, టౌన్​ ప్లానింగ్​ అధికారులు భవనం వద్దకు వెళ్లి స్లాబ్ కు బొక్కలు పెట్టి కూల్చివేయాలని నిర్మాణదారును హెచ్చరించి వచ్చేశారు. 

ఆ సమయంలో 3 నెలల పాటు తాత్కాలికంగా పనులు ఆపేసిన నిర్మాణదారు.. ఆ తరువాత మళ్లీ పనులు చేపట్టారు. ప్రస్తుతం రెండు అంతస్తుల సెల్లార్ కలిపి ఏడు అంతస్తుల భవనం నిర్మించారు. నిబంధనల ప్రకారం 5 అంతస్తుల భవన నిర్మాణం చేయడానికి 100 అడుగుల రోడ్డుకు ముందు వైపు 18 అడుగులు, భవనం మూడు వైపులా 13 అడుగుల చొప్పున సెట్ బ్యాక్స్ వదలాల్సి ఉన్నా.. ఆవేమీ పట్టించుకోలేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన మున్సిపల్ అధికారులు చోద్యం చూడడంపై ప్రభుత్వం కూడా సీరియస్​గా ఉన్నది.