- అమీన్‌పూర్ నాలా, మల్కాజిగిరిలోని డిఫెన్స్ కాలనీ బల్దియా స్థలాన్ని ఆక్రమించారని కంప్లయింట్స్
- మ్యాప్‌లు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న హైడ్రా చీఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బుద్ధభవన్ లోని హైడ్రా హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 89 ఫిర్యాదులు రాగా ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నేరెడ్‌మెట్‌కు చెందిన బీఆర్ఎస్కార్పొరేటర్కబ్జాలకు పాల్పడుతున్నారని కంప్లయింట్స్ వచ్చాయి. అమీన్‌పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాలాను ఆక్రమించాడని స్థానికులు ఫిర్యాదు చేశారు.
అలాగే మల్కాజిగిరి నియోజకవర్గంలోని డిఫెన్స్ కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన వెయ్యి గజాల స్థలాన్ని నేరెడ్ మెట్ కార్పొరేటర్ కబ్జా చేసుకుంటూ వస్తున్నారని డిఫెన్స్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కంప్లయింట్చేశారు. నిజాంపేట పరిధిలోని మేడికుంట చెరువు 45 ఎకరాలు ఉండేదని, కబ్జాలు జరిగి చెరువు కుంచించుకుపోయిందని అక్కడ ఉండే వృద్ధ దంపతులు వినతిపత్రం ఇచ్చారు.
మూసాపేటలోని ఆంజనేయనగర్ రోడ్డు నంబరు 9లో 2 వేల గజాల పార్కు స్థలం కబ్జా అవుతోందని, అడ్డుకున్న తమపై దాడికి దిగుతున్నారని స్థానికంగా ఉండే భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. ఈ పార్కును అభివృద్ధి చేయడానికి రూ. 50 లక్షలు ప్రభుత్వం విడుదల చేయడం, శిలాఫలకం వేయడం జరిగిందన్నారు. ప్రహరీ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారని రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. వీటితో పాటు వచ్చిన ప్రతి కంప్లయింట్‌ను కమిషనర్ పరిశీలించారు.
ఫిర్యాదులను పరిశీలించి గూగుల్ మ్యాప్స్‌తో పాటు సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇమేజీలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి అందులో వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల అధికారులు ఫీల్డ్ విజిట్‌చేసి ఫిర్యాదుల సంగతి చూడాలని ఆదేశించారు. చెరువుల ఎఫ్టీఎల్నిర్ధారణ పూర్తయితే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని, నాలుగైదు నెలల్లో ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరుగుతుందన్నారు.