సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌పై కంప్లయింట్స్.. డబ్బులు ఇవ్వటం లేదని బాధితుల ఆందోళన

సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్.. టీవీ పెడితే చాలు యాడ్సే యాడ్స్.. సువర్ణ భూమిలో ప్లాట్ కొని మీ కలలను సాకారం చేసుకోండి.. మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి.. ఇలా ఉంటాయి ఈ యాడ్స్. అంతేనా అప్పట్లో ప్రముఖ దివంగత దర్శకులు విశ్వనాథ్.. ఇప్పుడు మెగా హీరో రాంచరణ్ తో భారీ ఎత్తున ప్రచారం చేశారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో పెట్టుబడి పెట్టండి.. తరతరాలకు తరగని ఆస్తిని సొంతం చేసుకోండి.. అంటూ ఒకటే యాడ్స్ ఇచ్చాయి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందా ఏంటీ అనే డౌట్స్ వస్తున్నాయి. 

అందుకు కారణం.. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కంప్లయింట్స్ చేయటం సంచలనంగా మారింది. సదరు సంస్థ ఎండీ శ్రీథర్‌పై పలువురు సాఫ్ట్ వేర్, రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్‌‌మెంట్ పేరిట తమను మోసం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకొక్కరి నుండి రూ. 30 లక్షల నుండి కోటి రూపాయల వసూలు చేసినట్లు తెలిపారు. 

తమ సంస్థలో ఇన్వెస్ట్‌‌మెంట్ చేస్తే ఏడాదిన్నర తరువాత పెట్టిన పెట్టుబడి మొత్తంపై 25 శాతం ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ హామీ ఇచ్చారని బాధితులు వాపోయారు. ఆ గడువు ముగిసినప్పటికీ, తిరిగి తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్‌పై కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.