వడ్ల పై మిల్లర్ల కొర్రీలు!

వడ్ల పై మిల్లర్ల కొర్రీలు!
  • ఎంటీయూ 1271, 1262పై అభ్యంతరాలు
  • ఐకేపీ సెంటర్లలో కొనేందుకు నిరాకరణ 
  • అధికారుల జోక్యంతో 1262 రకానికి కొందరు ఓకే

ఖమ్మం, వెలుగు: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో కొంత మంది మిల్లర్ల కొర్రీలు రైతులకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. సన్న రకాలపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జాబితాలో ఉన్న రకాలను కూడా కొనుగోలు చేయకుండా విముఖత చూపిస్తుండడంతో రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. మిల్లర్లు ధాన్యాన్ని అన్​ లోడ్​ చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు.  ఎంటీయూ 1271, ఎంటీయూ 1262 రకాలను కొనడం లేదు. 

తరచుగా ఏదో ఒక సొసైటీలో ఈ సమస్య వస్తుండగా, అధికారుల జోక్యంతో 1262 రకం ధాన్యాన్ని తీసుకునేందుకు కొందరు మిల్లర్లు ముందుకు వచ్చారు. ఆ మిల్లర్లకు తాజాగా అడిషనల్​ అలాట్​ మెంట్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. స్టాక్​ తీసుకునేందుకు సానుకూలంగా ఉన్న వారికి 1262 రకం ధాన్యాన్ని పంపిస్తున్నామని జిల్లా అధికారులు చెబుతుండగా, 1271 రకం విషయంలో మాత్రం ఇంకా
 క్లారిటీ రాలేదు.

ఖమ్మం జిల్లాలో ఈ సీజన్​ లో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 33 రకాల సన్నాలను గుర్తిస్తూ, క్వింటాకు రూ.500 బోనస్​ ప్రకటించడంతో ఈ సారి ఎక్కువ మంది రైతులు సన్న రకాలపై ఆసక్తి చూపించారు. ప్రభుత్వం గుర్తించిన సన్నాల జాబితాలో ఉన్న ఎంటీయూ 1271, 1262 రకాలు కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల్లో సాగైనట్టు సమాచారం. ఈ రెండు రకాలు కస్టమ్​ మిల్లింగ్ రైస్​ (సీఎంఆర్)​ ఇచ్చేందుకు గిట్టుబాటు కావని, నూక శాతం అధికంగా వస్తాయనే కారణాలతో తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. 

1271 రకంలో కొన్ని ప్రభుత్వం నిర్దేశించిన లక్షణాలకు సరిపోకపోవడంతో తీసుకోవడం లేదని చెబుతున్నారు. సన్నాలను గుర్తించేందుకు గింజ పొడవు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలని, 2 మిల్లీమీటర్ల వెడల్పు మించకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఖమ్మం జిల్లాలో సాగయిన 1271 రకం ధాన్యం కొంత దొడ్డుగా ఉండడం వల్ల, వాటిని సన్నాలుగా పరిగణించలేమని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం ఈ రకం ధాన్యాన్ని సన్నాలుగా గుర్తిస్తూ ముందుగా ప్రకటించడం వల్లే తాము సాగుచేశామని అంటున్నారు. వీటిని కూడా కొనుగోలు చేసి, తమకు బోనస్ వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు.

ALSO READ : ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో.. తగ్గిన చిరుధాన్యాల సాగు

మంగళవారం కామేపల్లి మండలం పొన్నెకల్​, ముచ్చర్ల, ఖమ్మం రూరల్​ మండలం గోళ్లపాడు నుంచి సివిల్ సప్లై అధికారులకు ఈ సన్నాలు తీసుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయి. దీంతో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​ రెడ్డితో కలిసి సివిల్ సప్లై అధికారులు ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. సన్నాలను గుర్తించే మిషన్​ లో ఫిట్ కాని ధాన్యాన్ని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లేని ధాన్యాన్ని దొడ్డు వడ్లుగా గుర్తించి కొనుగోలు చేస్తామని రైతులకు చెప్పారు. బోనస్​ నష్టపోతుండడంతో రైతులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ధాన్యం కొనేందుకు నిరాకరిస్తున్నారు: 

8 ఎకరాల్లో ఎంటీయూ 1271 రకం ధాన్యాన్ని పండించాము. ధాన్యం శాంపిల్ తీసుకొని ఎర్రగూడలోని ఐకేపీ సెంటర్​ కు తీసుకువెళ్తుంటే, ఆ రకం వడ్లను మిల్లర్లు దించుకోవడం లేదని చెప్పి మూడు నాలుగు రోజుల నుంచి తిప్పించుకుంటున్నారు. బీపీటీ తప్ప వేరే రకం తీసుకోబోమని అంటున్నారు. నాతో పాటు మా ఊర్లో మరో ముగ్గురు 1262 రకానికి చెందిన ధాన్యం కలిపి మొత్తం వెయ్యి బస్తాలను తీసుకోవడం లేదు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుందామంటే క్వింటా రూ.1900 కే అడుగుతున్నారు. - వి.వీరచంద్రరావు, బాజుమల్లాయిగూడెం, కారేపల్లి మండలం 

ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం 

ఎంటీయూ 1271, 1262 రకాలకు సంబంధించి రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం. 1262 రకాన్ని కొంత మంది మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఆ రకం పట్ల ఆసక్తి చూపించిన మిల్లర్లకు తాజాగా అడిషనల్​ అలాట్ మెంట్ చేశాం. 1271 లో కొన్ని ప్రైవేట్ రకాలు కూడా ఉన్నాయి. సన్నాలను చెక్​ చేసే మిషన్​ లో అవి ఫిట్ కావడం లేదు. ఇప్పటి వరకు 1.65 లక్షల మెట్రిక్​ టన్నులను ఇప్పటి వరకు కొనుగోలు చేశాం. మిగిలిన వాటి సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తాం.  - జి.శ్రీలత, సివిల్ సప్లైస్​ జిల్లా మేనేజర్​