ఈసారి ఈసీకి ఈసడింపులే.!

ఈసారి ఈసీకి ఈసడింపులే.!

ఎన్నికల కమిషన్‌‌‌‌ మీద ఈసారి వచ్చినన్ని విమర్శలు గతంలో ఎన్నడూ రాలేదు. అధికారంలో ఉన్న బీజేపీకి పూర్తి అనుకూలంగా ఈసీ పనిచేసిందన్న విమర్శలు హోరెత్తాయి. ప్రధాని మోడీకి అనుకూలంగా ఉండేందుకే మే నెలలో మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. పోలింగ్ తేదీల సంగతి పక్కన పెడితే ఎన్నికలు ప్రారంభమయ్యాక అనేక అంశాల్లో ఈసీ నిష్పక్షపాతంగా పనిచేయలేదన్న ఆరోపణలు జోరందుకున్నాయి. దేశంలోని సీనియర్ పొలిటీషియన్లు ఈసీ పనితీరుపై మండిపడ్డారు.

సర్జికల్ స్ట్రయిక్స్‌‌‌‌–2 పేరుతో ప్రధాని మోడీ ఓట్లు అడిగినా ఈసీ పట్టించుకోలేదు. సైనికుల త్యాగాల గురించి ప్రస్తావించడం ఎన్నికల కోడ్‌‌‌‌ ఉల్లంఘించడమే అవుతుందని గతంలోనే ఈసీ తెగేసి చెప్పింది. అయినాగానీ, ఈ ఉల్లంఘనకు మోడీ ఒక్కరే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ లీడర్లంతా పాల్పడ్డారు. సైనికుల త్యాగాల గురించి తమ ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. ఇలాంటి మాటల వల్ల బీజేపీకి పడే ఓట్లు పెరుగుతాయని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత బీ.ఎస్.యడ్యూరప్ప బహిరంగంగానే చెప్పారు. ఈ దశలో ఎన్నికల సంఘం సైలెంట్‌‌‌‌గా ఉండటాన్ని  ప్రతిపక్ష నాయకులు తప్పు పడుతున్నారు. అలాగే మన మధ్య లేని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై  ‘భ్రష్టాచారి నెంబర్ ఒన్’ అంటూ మోడీ నోరు పారేసుకున్నా ఆయన నోటికి తాళం వేయడానికి ఎన్నికల కమిషన్‌‌‌‌ ప్రయత్నించలేదన్న ఆరోపణలున్నాయి.  ఈ విషయాన్ని కాంగ్రెస్ వదలి పెట్టలేదు. మోడీపై చేస్తున్న ఫిర్యాదుల మీద ఈసీ సరిగా స్పందించడం లేదంటూ ఏకంగా సుప్రీం కోర్టు గడప తొక్కింది. దీంతో కొన్ని గంటల్లోనే ఎన్నికల సంఘం స్పందించి, మోడీ కామెంట్లు కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టం చేసింది. మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఆర్టికల్ 324 ప్రయోగం

పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఆర్టికల్‌‌‌‌–324ని ప్రయోగించడంకూడా విమర్శలకు దారి తీసింది.. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా బెంగాల్ పర్యటన సందర్భంగా వయొలెన్స్‌‌‌‌ చోటు చేసుకుంది. దాన్ని కారణంగా చూపిస్తూ ఆర్టికల్–324ని ఈసారి ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ప్రయోగించింది. పశ్చిమ బెంగాల్లో ప్రచార గడువును ఒక రోజు మందుగానే ముగించింది. ఇందులోనూ మోడీకి అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. మోడీకి మరో రెండు సభల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చింది. యూపీ సహా మిగతా రాష్ట్రాల్లో సీట్లు కోల్పోవడమంటూ జరిగితే ఆ లోటు భర్తీకి వెస్ట్ బెంగాల్‌‌‌‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతిపక్ష నాయకులు. అంతేకాదు, 2021లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లాభం పొందడానికే బీజేపీకి అనుకూలంగా ఈసీ నిర్ణయాలు తీసుకుందన్న  ఆరోపణలు వారినుంచి వినిపించాయి.

వివాదంగా మారిన వీవీప్యాట్‌‌‌‌లు

వీవీ ప్యాట్‌‌‌‌ల లెక్కింపు అంశం కూడా వివాదంగా మారింది. ఈ అంశంపై చంద్రబాబు చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఓటింగ్‌‌‌‌ ముగిసిపోయిన నెల రోజులకు ఫిర్యాదులు రాగా, అక్కడ రీపోలింగ్‌‌‌‌కి నిర్ణయం తీసుకోవడం ఏంటని టీడీపీ అధినేత ప్రశ్నించారు.

సహజంగా ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఎప్పుడూ వార్తల్లో ఉండదు. ఎన్నికలు జరిగినప్పుడు ఈసీ గురించి వార్తలు, ఆరోపణలు వస్తుంటాయి. ఇది ప్రతిరోజూ రెగ్యులర్ గా ఉండే వ్యవహారం కాదు. ఎప్పుడో ఐదేళ్లకు  జరిగే ఈ ఎన్నికల వ్యవహారంలో ఈసీ బ్యాలెన్స్ తప్పకూడదని ప్రజాస్వామ్య వాదులు భావిస్తున్నారు. లేదంటే మోడీ హయాంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలు తమ ప్రతిపత్తిని కోల్పోయినట్లే ఈసీ కూడా కోల్పోయిందని భావించాల్సి వస్తుంది. జనం దృష్టిలో  రాజ్యంగ సంస్థే పలచన అవుతుందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అంతేకాదు దాపరికాలు లేవనేలా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీ పై ఉంది.

– సిద్ధార్థ భట్ (ది వైర్‌‌‌‌ సౌజన్యంతో