
నేడు అవినీతి మహమ్మారి సమాజంలో ప్రతిచోట తిష్టవేసి కోరలు చాస్తోంది. ప్రతి నిత్యం ఏదో ఒకశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. కొందరు అవినీతి అక్రమార్కుల ప్రవర్తన ఫలితంగా మొత్తం ఉద్యోగ వర్గాలు సమాజంలో తలదించుకునే పరిస్థితులను కల్పిస్తున్నారు. ఉద్యోగ నిర్వహణ, ప్రజాసేవ పక్కనపెట్టి అక్రమార్జన అసలు పనిగా పెట్టుకుని ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు.
అవినీతి అనకొండల దోపిడీకి సామాన్యుడు ఏదో ఒకచోట బలవుతూనే ఉన్నాడు. లంచాలకు రుచి మరిగిన ఉద్యోగులు ఏటా వందల మంది అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నా పరిస్థితులలో మార్పు రావటం లేదు. వాస్తవానికి అవినీతి అక్రమాలు తెరమాటున నిత్య కృత్యమైపోతున్నా అక్కడక్కడా తెరమీదకు వచ్చేవి కొన్ని మాత్రమే. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొద్దిమంది అక్రమార్కుల పనితీరు వల్ల లంచం ఇస్తేగాని ఫైలు ముందుకు కదలదు.
2024లో అవినీతి నిరోధక శాఖ 152 కేసులు నమోదు చేసి వివిధ శాఖలలో 223 మంది నిందితులను అరెస్టుచేసి కేసులు నమోదు చేసింది. 2025 మొదటి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి) ఏసీబీ 52 కేసులను నమోదు చేసి ఆరుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా 55 మంది ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
ఏప్రిల్ మాసంలో అవినీతి నిరోధక శాఖ దాదాపు 11 కేసులను నమోదు చేసి లంచగొండులను అరెస్టు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవినీతి నిరోధకశాఖ అరెస్టు చేసి అతనిపై పెట్టిన కేసులో న్యాయ విచారణ కొనసాగించాలంటే ఆ ఉద్యోగికి సంబంధించిన శాఖకు చెందిన ఉన్నతాధికారి అనుమతి ఇవ్వాలి.
అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ఉద్యోగులపై న్యాయ చర్యలకు అనుమతించడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏసీబీ 2024 వ సంవత్సరంలో 105 అవినీతి కేసులలోనే నిందితులపై అభియోగ పత్రాల దాఖలుకు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది.
ప్రభుత్వం లంచగొండులపై అభియోగ పత్రాల దాఖలు విషయంలో జాప్యాన్ని నివారించి పలు శాఖాధిపతులకు దిశా నిర్దేశం చేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఏసీబీ కేసులలో నిందితులకు శిక్షలుపడ్డ సమాచారాన్ని సామాజిక, ప్రసార మాధ్యమాలలో విరివిగా ప్రచారం చేయాలి. అన్నింటికీ మించి లంచగొండుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి