క్యూ కడుతున్న భూకబ్జా బాధితులు.. బీఆర్ఎస్ లీడర్ల కబ్జాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

  •      సీపీకి రెండు రోజుల్లో 40కిపైగా ఫిర్యాదులు  
  •      కాంగ్రెస్ లీడర్ పురుమళ్ల శ్రీనివాస్ పైనా కంప్లయింట్ 

కరీంనగర్/కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇటీవల ఓ భూకబ్జా కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములుతోపాటు బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావు అరెస్టు తర్వాత భూకబ్జా బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. గత సర్కార్ హయాంలో జరిగిన తమ భూ కబ్జాలు, లీడర్లు, రియల్టర్ల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి రెండు రోజుల్లో 40కిపైగా ఫిర్యాదులు రావడం గమనార్హం. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

బీఆర్ఎస్ లీడర్లు, రియల్టర్లపైనే ఫిర్యాదులు.. 

సీపీకి అందిన ఫిర్యాదుల్లో  ఎక్కువగా బీఆర్ఎస్ లీడర్లు, రియల్టర్లపైనే ఉన్నట్లు తెలిసింది. రేకుర్తి ఏరియాలో ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడడంతోపాటు వాటిని జనాలకు అమ్మి మోసం చేస్తున్నట్లు ఓ కార్పొరేటర్ భర్తపై పలువురు బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నకిలీ పత్రాలు చూపించి తమకు సర్కార్ భూములను అమ్మినట్లు వారు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఇంటి నిర్మాణ పర్మిషన్ విషయంలోనూ ఇబ్బందులకు గురి చేయడం, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు డిమాండ్ చేయడంలాంటి ఆరోపణలు కూడా చేసినట్లు తెలిసింది.  అలాగే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే ఓ రియల్టర్ కరీంనగర్ సిటీలో పలువురికి ప్లాట్లు చూపించి, అగ్రిమెంట్ చేసుకుని, తీరా డబ్బులు ముట్టజెప్పాక రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ కాగితాలు కూడా నకిలీవి చూపెట్టడమేగాక డబ్బులు అడిగితే బెదిరిస్తుండడంతో పలువురు బాధితులు సీపీని ఆశ్రయించినట్లు తెలిసింది.  కాగా కాంగ్రెస్ నాయకుడు పురుమల్ల శ్రీనివాస్ పై కూడా పలువురు సీపీకి ఫిర్యాదు చేశారు. బొమ్మకల్ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకుని స్థానికంగా ప్రభుత్వ భూములు ఆక్రమించాడని, నకిలీ పత్రాలు సృష్టించి ఇతరుల భూముల్లోకి ప్రవేశించి ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదు చేశారు., ఆయనపై గతంలో కబ్జా కేసులు నమోదయ్యాయి. తాజాగా వాటిపై మళ్లీ ఫిర్యాదులు అందుతున్నాయి. 

ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్స్​ సాయంతో ఎంక్వైరీ

తనకు అందిన ఫిర్యాదులను సీపీ సంబంధిత ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపుతున్నారు. భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రత్యేకంగా విచారించేందుకు సీపీ ఏర్పాటు చేసిన ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ సాయంతో లోతుగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే కబ్జాదారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. వరుస ఫిర్యాదులు, పోలీసుల చర్యలతో కబ్జాలకు పాల్పడిన లీడర్లు, రియల్టర్లలో టెన్షన్ మొదలైంది. 

 పోలీసులను ఆశ్రయించవచ్చు

తమ స్థలాలు కబ్జాకు గురైన బాధితులు ఉంటే నేరుగా పోలీసులను కలవొచ్చు. ఎలాంటి భయం అవసరం లేదు. బాధితులు ఇచ్చిన ఆధారాలపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తాం. ఇతరుల భూములను ఆక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. 
- నరేందర్, ఏసీపీ, కరీంనగర్ టౌన్