హైడ్రా ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

హైడ్రా ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
  • హైడ్రా ఏర్పాటు తర్వాత బల్దియాకు భారీగా కంప్లయింట్స్​
  • రెండు నెలల్లో 300కు పైగా ఫిర్యాదులు
  • జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఏర్పాటు తర్వాత నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కంప్లయింట్స్​ను పరిశీలిస్తున్న బల్దియా కమిషనర్ ఆమ్రపాలి.. ఆయా ఫిర్యాదుల్లో కొన్నింటిపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నారు. హైడ్రా ఏర్పడక ముందు నెలకు 50 నుంచి 60 వరకు మాత్రమే ఫిర్యాదులు రాగా.. గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీకి  ఇల్లీగల్ నిర్మాణాలపై  300కుపైగా  ఫిర్యాదులు అందాయి. ఇందులో 200 కుపైగా కంప్లయింట్స్​పై  విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

ప్రజావాణిలో సైతం ఇవే ఎక్కువ 

ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసుతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో జరిగే ప్రజావాణికి అక్రమ నిర్మాణాలపైనే ఎక్కువ కంప్లయింట్స్​ వస్తున్నాయి. ఒక్క హెడ్ ఆఫీసులో నిర్వహించే ప్రజావాణికి గత నెల రోజుల్లోనే  టౌన్ ప్లానింగ్ విభాగానికి 140 ఫిర్యాదులు అందాయి.  హైడ్రా ఏర్పాటు తర్వాత ఈ విభాగానికే అత్యధికంగా కంప్లయింట్స్​వస్తున్నాయి. మిగతా  విభాగాలకు వచ్చే ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ కంటే తక్కువగా ఉంటున్నాయి. 

గ్రేటర్ లో 40 వేలకుపైగా అక్రమ నిర్మాణాలు?

గ్రేటర్ లో దాదాపు 40 వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.  ఎక్కువగా కూకట్ పల్లి, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి జోన్లలో ఉన్నాయి. ప్రస్తుతం బల్దియాకు వస్తున్న ఫిర్యాదులు కూడా ఈ జోన్ల నుంచే ఉంటున్నాయి. జీహెచ్ఎంసీ నుంచి గ్రౌండ్ ప్లస్2 కి అనుమతులు తీసుకొని, అంతకు మించి వేయడం, కొందరు సెల్లార్లను  నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండడంతో  ఆక్యుపేషన్​సర్టిఫికెట్లు(ఓసీ) అందడంలేదు. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేస్తున్నారు.