
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీస్లో సోమవారం ప్రజావాణికి 71 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులు సేకరించి, అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు సూచించారు. ఒకప్పడు సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలు ఇప్పుడు వినియోగంలో లేవన్నారు. వాటిని ప్రజావసరాలకు కేటాయించిన స్థలంగానే పరిగణించి, ఎవరైనా కబ్జా చేస్తే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు.
ఇందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం కోహెడలో సమ్మిరెడ్డి బాల్ రెడ్డి తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 951 నుంచి 954 లోని తమ ప్లాట్లలో కొన్నింటిని కాజేసి ఫామ్ హౌస్ మాదిరి చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారని, అందులోకి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు.
నల్లమల్లారెడ్డిపై ఫిర్యాదులు
అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొర్రెములలో తమ ప్లాట్లను నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని స్థానికుడొకరు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 716 నుంచి 718లో తనతోపాటు 23 మంది కొన్న కొన్న ప్లాట్లను నల్లమల్లారెడ్డి ఆక్రమించాడని పేర్కొన్నారు. తమ ప్రైవేటు ప్లాట్లను మాత్రమే కాకుండా, ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి రాజకీయ పలుకుబడితో వాటిని అనుభవిస్తున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో హైడ్రా జోక్యం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఇప్పించండి
ప్రభుత్వం తనకు కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక 300ల గజాల స్థలాన్ని కేటాయించినా తీసుకోలేయానని మాజీ సైనిక ఉద్యోగి సీతారామరాజు ఫిర్యాదు చేశారు. తన 300 గజాలతోపాటు మొత్తం 1,253 గజాలను స్థానిక మహిళ కబ్జా చేశారని, ఇదంతా ప్రభుత్వ స్థలమన్నారు. కోర్టు ఉత్తర్వులతో పాటు ప్రభుత్వ ఆదేశాలున్నా తనకు 300 గజాల స్థలం దక్కడం లేదని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జాదారు నుంచి కాపాడి తనకు స్థలం వచ్చేలా చూడాలని కోరారు.