అయోధ్యలో దివ్యమైన రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈరోజు (జనవరి 22 వ తేదీ)న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. వేదమంత్రోచ్చారణ మధ్యరామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు.
అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహంలో వేద మంత్రాలతో ప్రాణ శక్తిని నింపారు. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తి స్థాపించడం అని అర్థం. ఇప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా.. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.
విగ్రహం కింద భాగంలో బీజాఅక్షరాలతో కూడిన యంత్రాలను ఉంచి వాటిపై దేవుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయోధ్య బాలరాముడి విగ్రహం కింద ప్రతిష్ఠించిన యంత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లోని చీరాల నుంచి పండితులు చెక్కి అయోధ్యకు పంపారు. ఈ బీజా అక్షరాలలో మూల మంత్రాన్ని చెక్కి దానికి జపం.. అనుష్ఠానం మొదలైనవి నిర్వహించారు. తరువాత సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి... శ్రీరాముడికి కళ్లకు కట్టిన వస్త్రాన్ని తీశారు. ఆ తరువాత స్వామి వారికి వేదపారాయణంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామివారికి నూతన వస్త్రాలు కట్టి . షోడశోపచార పూజలు నిర్వహించి.. ధూపం..దీపం.. నైవేద్యం, హారతి మొదలైనవి స్వామివారికి సమర్పించారు.