- యాప్రాల్‌లో అంత్యక్రియలు పూర్తి
బషీర్ బాగ్/శంషాబాద్ /మల్కాజిగిరి, వెలుగు: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ కు పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రజల సందర్శన కోసం ఆయన భౌతికకాయాన్ని ఆదివారం హిమాయత్ నగర్ సీపీఐ రాష్ట్ర ఆఫీస్‌లో ఆవరణలో పెట్టగా, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేథావులు, ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సలహాదారు వేం నరేంద్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్, వి.శ్రీనివాస్, డాక్టర్ చెరుకు సుధాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హాజరై బాలమల్లేశ్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
యాప్రాల్‌లోని స్మశాన వాటికలో ఆదివారం ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు. శంషాబాద్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాలమల్లేశ్ ఫొటోకు సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఇతర లీడర్లు, వికారాబాద్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, పలువురు నేతలు నివాళులర్పించారు.