అభయ హస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి

 అభయ హస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో వచ్చిన అభయ హస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీ దాదాపు పూర్తయింది. శుక్రవారం రాత్రి నాటికి ఏకంగా కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మిగిలిన ఐదారు లక్షల అప్లికేషన్ల సమాచారాన్ని శనివారం, ఆదివారంలోపే పూర్తి చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం డేటాను డిజిటలైజ్ చేసి.. ఇతర శాఖల్లో ఇప్పటికే ఉన్న డేటాతో సరిపోల్చుతారు. ఈ సందర్భంగా ఎలాంటి డూప్లికేషన్ రాకుండా అటు ఆధార్ ఇటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇతరత్రా ప్రభుత్వ డిపార్ట్​మెంట్లలో ఉన్న సమాచారంతో సీజీజీ, ఎన్ఐసీ, ఐటీ డిపార్ట్​మెంట్ల సహకారంతో వడపోయనున్నారు. ఏదైనా దరఖాస్తులో తప్పు ఉన్నదని పక్కన పెట్టినట్లయితే అందులో ఉన్న ఫోన్ నంబర్​కు కాల్ చేసి సరిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐదు గ్యారంటీల అమలు, ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లపై చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? డేటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది? ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారీగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? అనే వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. 

ఓటీపీ అనే అంశమే దరఖాస్తులో లేదు

ప్రజా పాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదని మంత్రి భట్టి పేర్కొన్నారు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదని.. ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 5 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.

త్వరలోనే గృహజ్యోతి స్కీం

ఐదు గ్యారంటీలలో ఇప్పటికే రెండు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో మహాలక్ష్మీ స్కీమ్​లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుండగా.. రాజీవ్​ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పుడు త్వరలోనే గృహజ్యోతి గ్యారంటీని అమల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నది. ఇప్పటికే డిస్కంల నుంచి రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉందనే వివరాలు ప్రభుత్వం తీసుకున్నది. 200 యూనిట్లలోపు ఇస్తే ప్రభుత్వం నుంచి డిస్కంలకు నెలకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది? ప్రజా పాలన అప్లికేషన్లలో ఎంతమంది గృహజ్యోతికి అప్లై చేసుకున్నారు అనే వాటిపై చర్చించింది. త్వరలోనే గృహజ్యోతిని అమల్లోకి తీసుకురానున్నట్లు సూచన ప్రాయంగా ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిసింది.