- సెన్సిటివ్కట్టడాలను టచ్చేయకుండా అలైన్ మెంట్
- ప్రభావిత ఇండ్లకు మాత్రమే మార్కింగ్
- 1,100 ఆస్తుల్లో 800 ఆస్తులకు నోటిఫికేషన్ రిలీజ్
- కొనసాగుతున్న మార్కింగ్.. నెలాఖరుకు కూల్చివేతలు షురూ
హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓల్డ్ సిటీ మెట్రో పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి పనులను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో120 అడుగుల భూసేకరణ చేస్తున్నారు. బీఆర్ఎస్హయాంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఫస్ట్ ఫేజ్‌లోనే నిర్మించాలని నిర్ణయించినా భూసేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో నిలిపివేశారు. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక ఓల్డ్‌సిటీ మెట్రోను చాంద్రాయణగుట్ట వరకు పొడిగించింది.
మొత్తం 7.5 కిలోమీటర్ల దూరంలో ఎంజీబీఎస్, సాలర్జంగ్మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఆలియాబాద్, ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట స్టేషన్లు రానున్నాయి. ఈ రూట్లో 11 వందల ఆస్తులు ప్రభావితమవుతుండగా 103 మతపరమైన కట్టడాలతోపాటు హెరిటేజ్ నిర్మాణాలకు గుర్తించారు. వీటి పరిరక్షణ విషయంలో మెట్రో అధికారులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెన్సిటివ్ కట్టడాలను కూల్చకూడదనే ఉద్దేశంతో లేటెస్ట్ ఇంజినీరింగ్టెక్నాలజీ ఉపయోగించి మెట్రో పిల్లర్లు, స్టేషన్లు నిర్మించనున్నారు.
200 ఆస్తులకు త్వరలోనే అవార్డు
భూసేకరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్టకు మెట్రో వెళ్లే మార్గంలో రెవెన్యూ ఆఫీసర్లు ప్రభావిత ఇండ్లకు, షాపులకు మార్కింగ్ చేస్తున్నారు. ఏ ఇల్లు ఎంత మేర కూల్చనున్నారో తెలిపేలా మార్కింగ్ చేస్తున్నారు. 1,100 ఆస్తులు ప్రభావితమవుతుండగా భూసేకరణ చట్టం 2013 ద్వారా ఇప్పటికే 800 ఆస్తులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి సమర్పించారు. ఇందులో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ పూర్తయింది. వీటిలోని 200 ఆస్తులకు త్వరలో అవార్డు ఇవ్వనున్నారు.
నష్ట పరిహారం కింద స్క్వేర్యార్డుకు రూ. 65 వేల చొప్పున చెల్లిస్తామని గతంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. అయితే, నష్టపరిహారం విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తొంది. పరిహార ప్రక్రియ పూర్తయితే త్వరలో కూల్చివేతలు ప్రారంభించనున్నారు. కాగా, ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపన చేశారు. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు.