
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చెంచు గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించే ప్రక్రియను 4 నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిల్లా సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనలు ఆమోదించలేదని పేర్కొంటూ 2005లో శక్తి స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారిచింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.ఎస్. మూర్తి వాదిస్తూ.. 2005 నుంచి ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. 2006లో ఎస్టీ, ఇతర సంప్రదాయ ఆటనీ నివాసితులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం రూపొందిందని చెప్పారు. ఇది 2007 నుంచి అమల్లో ఉందన్నారు. అటవీ ప్రాంతంలో ఆవాసం ఉంటున్నవారు ఆటనీ ఉత్పత్తులను, వనరులను వినియోగించుకునేందుకు చట్టంలో అవకాశం ఉందని వివరించారు. అటవీ హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కోర్టు స్పందిస్తూ..ప్రభుత్వానికి 4 నెలల గడువు ఇస్తూ.. విచారణను వాయిదా వేసింది.