తాండూరు, వెలుగు: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులను ఈనెల30లోగా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం పెద్దేముల మండలం మన్సాన్ పల్లి, మంబాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ స్కూల్ లో భాగంగా చేపట్టిన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యతగా మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, విద్యుత్ పనులను చేపట్టాలని, నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల్లో నాణ్యత ఉండాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మంబాపూర్ లోని అపూర్వ లేడీస్ టైలర్ లో స్వయం సహాయక సంఘాలు స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ చేయిస్తుండగా కలెక్టర్ పరిశీలించి విద్యార్థులకు కొలతల ఆధారంగా ఆ దుస్తులను కుట్టాలని, నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు. అనంతరం మంబాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు ఇబ్బందులు రాకుండా సేకరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు.
మరో 18 వేల మెట్రిక్ టన్నులకు నగదు చెల్లింపులకు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లోకి నగదును వెంట వెంటనే జమ చేస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, జిల్లా మేనేజర్ సుగుణబాయి, డీఆర్ డీఓ శ్రీనివాస్ , డీడబ్ల్యుఓ, మండల ప్రత్యేక అధికారి జ్యోతి పద్మ, తహసీల్దార్ కిషన్ నాయక్, ఎంపీడీవో జర్నప్ప, పంచాయతీరాజ్ ఏఈ సిద్ధార్థ, పాఠశాలల హెడ్ మాస్టర్లు షరీఫుద్దీన్, రవీందర్, పంచాయతీ కార్యదర్శులు సంజీవ, సుజిత్ కుమార్ ఉన్నారు.