తీరనున్న కష్టాలు .. పెగడపల్లి ఈదులవాగుపై పూర్తయిన బ్రిడ్జి

తీరనున్న కష్టాలు .. పెగడపల్లి ఈదులవాగుపై పూర్తయిన బ్రిడ్జి
  • ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో మూడు నెలల్లో పూర్తి
  • 20 గ్రామాలకు రాకపోకలు సులభతరం
  • ముగిసిన ఎన్నికల కోడ్..త్వరలో ప్రారంభం

చినుకు పడిందంటే ఆ 20 గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా గడపాల్సి వచ్చేది. దశాబ్దాల కాలంగా పడుతున్న ఈ కష్టాలు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో  ఇక తీరనున్నాయి.  

కోల్​బెల్ట్​/జైపూర్​, వెలుగు: -మంచిర్యాల జిల్లా జైపూర్​మండల కేంద్రం నుంచి షెట్​పల్లికి వెళ్లే మార్గంలో పెగడపల్లి వద్ద ఈదులవాగుపై హైలెవల్ బ్రిడ్జి లేకపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడేవారు. వాగు పొంగిందంటే రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై హైలెవల్​ బ్రిడ్జి నిర్మించాలని అప్పటి బీఆర్ఎస్ ​పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో పెగడపల్లి, షెట్​పల్లి, గంగిపల్లి, శివ్వారం, నర్సింగాపూర్,  బెజ్జాల, మద్దులపల్లి, కుందారం, కిష్టారం, పౌనూరు, వేలాల నుంచి ప్రజలు ఏళ్లుగా రాకపోకలు సాగించడం పెద్ద సవాల్​గా ఉండేది.

జైపూర్ సింగరేణి థర్మల్​ పవర్ ప్లాంట్​లో పనిచేసే ఎల్కంటి, పెగడపల్లి, టేకుమట్ల, షెట్​పల్లి, గంగిపల్లి గ్రామస్తులకు ఇబ్బందులు తప్పేవికావు. మండల పరిధిలోనే ఈ ప్లాంట్​ఉండటంతో ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సీఎస్ఆర్, స్పెషల్​ ఫండ్స్​ కేటాయించే ఛాన్స్ ఉన్నా బ్రిడ్జి నిర్మాణం నోచుకోలేదు. 
ప్రజల ఒత్తిడితో రూ.3 కోట్ల స్టేట్ డెవలప్​మెంట్​ఫండ్స్​తో ఈదులపల్లి వాగుపై  హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణానికి 2023 మార్చిలో అప్పటి మంత్రులు హరీశ్​రావు, వేముల ప్రశాంత్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​శంకుస్థాపన చేశారు. నెలలు గడిచినా బ్రిడ్జి పనులు మాత్రం చేపట్టలేదు. గడిచిన వర్షాకాలం కూడా ప్రజలు వాగు దాటేందుకు అవస్థలు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని హడావుడిగా 2023 డిసెంబర్ లో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టినా నత్తనడకన సాగాయి. దీంతో ఈసారీ ఇబ్బందులు తప్పవని ప్రజలు భావించారు. 

3 నెలల్లో పూర్తి చేయించిన ఎమ్మెల్యే

ఈ క్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి గెలిచిన మూడు నెలల్లోనే జైపూర్ మండలం ఈదులవాగుపై హైలెవల్​ బ్రిడ్జి పనులను పూర్తి చేయించారు. ఈ మార్గం గుండా వెళ్తున్న ప్రజలు కష్టాలను ఎన్నికల ప్రచారంలో స్వయాన చూశారు. ఇబ్బందులను దూరం చేసేందుకు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే జనవరిలో  సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్​తో మాట్లాడి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం పనులు పురోగతిపై ఆరా తీస్తూ స్పీడప్ చేయించారు.  ఏళ్ల తరబడి సాకారం కాని బ్రిడ్జి కేవలం మూడు నెలల్లోనే పూర్తి కావడంతో తమ కష్టాలు తీరాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఏప్రిల్​లోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల కోడ్​తో ప్రారంభానికి నోచుకోలేదు. త్వరలో బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించనున్నారు. 

నిధులు మళ్లింపుతో పనులు జరగలే

జైపూర్​సింగరేణి థర్మల్​పవర్ ప్లాంట్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ఆర్, స్పెషల్​ ఫండ్స్​తో ఈదులవాగుపై హైలెవల్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ఛాన్స్​ ఉన్నా అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్​ పట్టించుకోలేదు. ఈ నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించాడు.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గెలిచిన వెంటనే మూడు నెలల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రజల ఏళ్ల కష్టాలను దూరం చేశారు.  

రిక్కుల శ్రీనివాస్​రెడ్డి, కాంగ్రెస్​ లీడర్​

ఎమ్మెల్యే వివేక్ చొరవతో తొలగిన ఇబ్బందులు

ఈదులవాగుపై బ్రిడ్జిలేక వర్షకాలం బాగా ఇబ్బందులు పడ్డాం. కనీసం నడిచేందుకు కష్టమయ్యేది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గెలిచిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే బ్రిడ్జి పనులు పూర్తి చేయించారు. ఎమ్మెల్యేకు మా అందరి తరఫున రుణపడి ఉంటాం

సుందిళ్ల రాజలింగు, ఆటో డ్రైవర్​, గంగిపెల్లి