మూసీ పునరుజ్జీవనంలో సంక్లిష్టతలు

వర్షాలు పడినప్పుడు నదులలో సహజంగా నీటి ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రవాహం ఆయా నదుల వైశాల్యం బట్టి ఉంటుంది. నీరు పల్లం బట్టి పారుతుంది. నదులు ఏర్పడి నప్పుడు  ఉన్న  పల్లం ప్రాంతాన్ని ఫ్లడ్ ప్లెయిన్ ఏరియా (flood plain area) అంటారు. అయితే,  వర్షంతీరు బట్టి,  స్థానిక  భూ మార్పులు బట్టి   ఈ ప్రాంతంలో మార్పులు వస్తాయి.  అటువంటి  అసాధారణ స్థితిలో తన ‘భూ పరిమితులు’ దాటి ప్రవహించే నీరునే వరదగా పరిగణిస్తాం.  ప్రతి నది వైశాల్యం కొన్ని వందల ఏండ్ల నుంచి స్థిరీకరణ జరిగింది.  ప్రవాహంలో హెచ్చుతగ్గులు బట్టి నది తన వైశాల్యం ఉపయోగించుకుంటుంది. 

నది ఒడ్డున పెరిగిన జనావాసాలు కూడా ఆ నది వైశాల్యాన్ని గౌరవిస్తూ నది నుంచి కావాల్సిన పర్యావరణ సేవలు పొందే సంస్కృతి ఇదివరకు ఉండేది. ఆధునికత పెరుగుతున్నకొద్దీ నదుల వైశాల్యాన్ని తమ ఇష్టానుసారంగా మార్చే దశకు పాలకులు చేరుకున్నారు. ఇది ఎక్కువగా పెద్ద నగరాలలో చూస్తున్నాం.  ప్రకృతిలో భాగమైన అడవి నిర్మూలన వల్ల వన్య ప్రాణులు జనావాసాలలోకి వస్తున్నాయి.  

నదుల ‘వైశాల్యాన్ని’ తగ్గించే చర్యల వల్ల ‘వరదలు’ పెరిగాయి.  నది తన సహజ ప్రవాహం బట్టి పారుతుంది.  ఎక్కువగా  వచ్చే ప్రవాహం వరదగా మారటానికి మానవ చర్యే కారణం. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరద వల్ల  తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించటానికి ప్రధాన కారణం మూసీ నది ఆక్రమణ.  నదిలో,  నది వెంబడి కట్టుకున్న ఇండ్లు కొట్టుకుపోయినాయి. మూసీ నది నిత్య ప్రవాహ నది కాదు. సంవత్సరం పొడవునా  నీళ్ళు పారవు.  సంవత్సరంలో   నీళ్ళు పారే కాలం 6 నెలలకు మించదు.  వర్షం బట్టి ప్రవాహం, వరద.  నది భూభాగం ఎండిపోయిన దరిమిలా అక్కడ స్థిర నిర్మాణాలు ఏర్పరుచుకోవడం అవివేకం, అనర్థం.  

ఆక్రమణలకు వరద ముప్పు

రెండు జలాశయాలను – ఉస్మాన్ సాగర్,  హిమాయత్ సాగర్ – నది మీద కట్టి వర్షపు నీరును నిలువ చేసి ఉపయోగించే వ్యవస్థ ఏర్పాటు చేశారు.  మూసీనది పరీవాహక ప్రాంతంలో పడే వర్షాన్ని మోసే బుల్కపూర్, ఫిరంగ నాలాల నిర్మాణం చేపట్టి   చెరువులలో  నింపే ఏర్పాటు చేశారు. మూసీ నదిలో 25 చోట్ల కత్వాలు కట్టి వర్షం నీరు చెరువులలోకి  మళ్ళించారు.  ఇవన్నీ కూడా  సహజ, ప్రకృతి  నీటి వ్యవస్థకు  అనుసంధానంగా  నిర్మించారు. 


ఇవి సుస్థిరంగా ఉండడమే వాటి ప్రణాళికలో ఉన్న గొప్పతనం.  సహజ నీటి వ్యవస్థను గౌరవిస్తూ,  నీటిని ఉపయోగించే వ్యవస్థ ఆనాటి నుంచి కూడా సత్ఫలితాలను ఇస్తున్నది.  ఫలితంగా, 100 ఏండ్లలో మూసీ నది  వరద  హైదరాబాద్ నగరాన్ని నష్టపెట్ట లేదు.   అత్తాపూర్,  సంగం,  లంగర్ హౌజ్, చాదర్​ఘాట్​తదితర ప్రాంతాలలో ఆక్రమణలు ఎప్పటికైనా  వరద వల్ల నష్టపోతాయి.  

ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, మట్టి దిబ్బలు ఉంటే ప్రవాహం ఇంకొక వైపు మళ్లి నష్టం పెంచవచ్చు.   ప్రభుత్వం నందనవనం ప్రాజెక్టు పేరుతో మూసీనది గర్భంలో  ప్రవాహాన్ని 9 మీటర్ల కాలువకు పరిమితం చేసి మిగతా భూభాగం ‘వాడుకుందాం’ అని ప్రణాళిక చేసింది.  ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఆ పథకం ముందుకు సాగలేదు. కానీ, అప్పటి కాలువ అక్కడక్కడా ఇప్పటికీ దర్శనం ఇస్తుంది. 

ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత 

చట్టాల ప్రకారం GHMC, HMDA, ఇరిగేషన్, హైదరాబాద్ జల మండలి, రెవెన్యూ శాఖలకు బాధ్యతలు ఉండగా విధుల పట్ల నిర్లక్ష్యం కనిపించింది.  గత రెండు దశాబ్దాలలో ఆక్రమణల స్వరూపం మారింది.  స్థిర నివాసానికి తపనపడే  పేదలే కాకుండా మధ్య తరగతి, ధనిక వర్గాల ఇంటి మార్కెట్ పెరుగుదలలో భాగంగా ఆక్రమణలు జరిగాయి.  బహుళ అంతస్తులు,  భారీ నిర్మాణాలు,  కమర్షియల్ బిల్డింగ్ ఆక్రమణలు పెరిగాయి.  ఇప్పుడు  ఆక్రమణలు తొలగిస్తామని  ప్రభుత్వం  పూనుకుంటే  వ్యతిరేకత వస్తున్నది. మీడియాతో సహా అన్ని రంగాలలో ‘పరపతి’ ఉన్న వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. 

Also Read : ప్రపంచస్థాయి ఆలోచన ఫోర్త్​ సిటీ

2000లో నందన వనం ప్రాజెక్టు పేరిట పేదలను నిర్వాసితులను చేస్తే కిక్కురుమనని ఈ వర్గాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆక్రమణల నిర్మూలన చర్యల పట్ల తమ ‘వ్యతిరేకత’ వ్యక్తపరచటానికి కారణం ఇదే.  ఆశ్చర్యంగా, ఈ వర్గాలు నగరంలో బిల్డింగ్ నిబంధనలు ఎట్లా సరళీకృతం చేశారు అనే దాని మీద విశ్లేషణలు చేయడం లేదు. కానీ, నది భూభాగం, FTL వంటి నిర్వచనాల మీద ధ్వజం ఎత్తుతున్నారు.  FTL అనేది చెరువుల నీటి నిలువను నిర్ధారించే ఒక కొలమానం. నది వైశాల్యం నిర్ధారించే కొలమానం flood plain area.  ఈ వైశాల్యం ప్రభుత్వమో, ప్రైవేటు వ్యక్తులు నిర్ణయించేది కాదు. నది తన ప్రవాహాన్ని బట్టి నిర్ణయిస్తుంది. మనం చేయాల్సింది అది ఎంత మేరకు ఉన్నది అని గుర్తించడమే.

మూసీ పునరుజ్జీవన పథకం పారదర్శకంగా ఉండాలి

ప్రభుత్వం ఈ flood plain areaను  గత వందేండ్ల ప్రవాహం అధ్యయనం బట్టి నిర్ణయించాలి. బఫర్ జోన్ అనేది ముందు జాగ్రత్తగా అధిక వర్షాలు వచ్చినప్పుడు పెరిగే వరదను బట్టి నిర్ణయించాలి. ఈ రెండింటి నిర్ధారణ శాస్త్రీయంగా, అధ్యయనం ప్రకారం జరపాలి. ఆ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి.  నదీ తీరం వెంబడి నది ప్రవాహం మీద ప్రభావం చూపెట్టే అన్ని రకాల అడ్డంకులను తొలగించాలి.  వీటి నిర్ధారణ బట్టి ఆక్రమణల చిట్టా తయారు అవుతుంది. ఇప్పటికే నిర్ధారించిన ఆక్రమణల చిట్టా ప్రభుత్వం బయటపెట్టాలి. 

మొదట్లో నింపిన మట్టిని, నిర్మాణ వ్యర్ధాలను తొలగించడం, కమర్షియల్ నిర్మాణాలు, బహుళ అంతస్తులు తొలగిస్తూ, అంచెలంచెలుగా పని చేస్తే ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. అదిచట్ట ప్రకారం, ఒక  ప్రణాళిక ప్రకారం చెయ్యాలి. మూసీ పునరుద్ధరణ శాస్త్రీయంగా, పారదర్శకంగా చేస్తే, ప్రజల్లో అవగాహన పెంచితే సత్ఫలితాలు వస్తాయి.  మూసీ నది పునరుజ్జీవన పథకం లక్ష్యాలు పారదర్శకంగా ఉంటే  ప్రజల మద్దతు లభిస్తుంది.

మూసీనది ఆక్రమణలకు రియల్​ ఎస్టేట్​ లింకులు

 మూసీ నది సుందరీకరణను ప్రతి ప్రభుత్వం వల్లె వేయడం ఎప్పుడో మొదలైంది.  ఈ క్రమంలోనే  మూసీనది మధ్యలో బస్టాండు నిర్మాణం జరిగింది.  తరువాత మెట్రో రైలు స్టేషన్ వచ్చింది. ఆ పక్కనే వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. మూసీ నది ఒడ్డున  ట్రాఫిక్ రద్దీ  తగ్గించడానికి రోడ్డు పేరిట మట్టితో నింపడం మొదలుపెట్టారు.  1990 దశకంలో అక్కడక్కడా మొదలు అయిన ఆక్రమణలు తెలంగాణ ఏర్పడిన తరువాత  విచ్చలవిడి దశకు చేరుకున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు, చట్టం అమలు చేయాల్సిన విభాగాలు ‘రాజకీయం’ అని సాకు చూపి మిన్నకున్నారు. 

మూసీనదిలో ఆక్రమణలకు నగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం తీరుతెన్నులకు దగ్గర సంబంధం ఉన్నది. భూమి రేటు పెరిగితే వీరికి లాభాలు.  ప్రభుత్వం కూడా ఆదాయం పెంచుకునే మార్గం అనుసరించింది.  దరిమిలా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పలుకుబడి గల ప్రైవేటు వ్యక్తులు తిష్ట వేయడం జరిగింది. ఈ పరిణామాలు మూసీ నదిని కూడా తాకాయి.

- దొంతి నరసింహరెడ్డి-