రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా యూనివర్సిటీకి కాంపౌండ్ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వ పెద్దలకు రాకపోవడం దురదృష్టకరం. వర్సిటీ భూములు కబ్జాకు గురి కాకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తం. ఒకట్రెండు రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం.' ఈ నెల 10న కేయూలో కాంపౌండ్ వాల్ తో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలివి.
హనుమకొండ, వెలుగు: కబ్జాకు గురైన కాకతీయ యూనివర్సిటీ కి చెందిన రూ.వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులపరం కాగా.. ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. కేయూ ల్యాండ్స్ కమిటీ ఇదివరకే సమగ్ర రిపోర్ట్ తయారు చేసినప్పటికీ రెండేండ్లు దాటినా దానిని ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారు. క్యాంపస్ చుట్టూ ఫిజికల్ సర్వే చేసి, హద్దులు నిర్ణయించాల్సిన అధికారులు, అదంతా ఏమీ చేయకుండానే రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా వర్సిటీ కాంపౌండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. రెండు రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని మంత్రులు ప్రకటించినా.. కబ్జాలు తేల్చకపోవడం, హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో వర్సిటీ భూముల రక్షణకు నిర్మించాల్సిన కాంపౌండ్ పనులు ఇప్పట్ల స్టార్ట్ అవడం కష్టమేనని స్పష్టమవుతోంది.
కబ్జా వివరాలతో ల్యాండ్ కమిటీ రిపోర్ట్
కాకతీయ యూనివర్సిటీ కోసం 1976 లో హనుమకొండలోని పలివేల్పుల, లష్కర్ సింగారం, కుమార్ పల్లి పరిధిలో మొత్తం 673 ఎకరాల 12 గుంటల భూమి సేకరించారు. సరైన రక్షణ లేకపోవడంతో ఆక్రమణలు జరిగాయి. వాటిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేయగా.. అప్పటి వీసీ తాటికొండ రమేశ్ డీజీపీఎస్ సర్వే చేయించి. ఆక్రమణలు గుర్తించారు.
ఈ సర్వే అనంతరం కేయూ ల్యాండ్స్ కమిటీ కూడా సమగ్ర సర్వే చేసింది. పూర్తి వివరాలతో 2021లోనే ఒక నివేదిక తయారు చేసింది. యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబుతో పాటు మొత్తంగా 13 మంది కబ్జాకు పాల్పడినట్టు గుర్తించి నివేదికను సమర్పించింది. కానీ రెండేండ్లు దాటినా ఈ రిపోర్టుపై స్పందన లేదు. క్యాంపస్ లోపల కూడా ప్రైవేటు వ్యక్తుల పేరున భూములు ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లో ఉండటం గమనార్హం.
హద్దులు నిర్ణయిస్తేనే కదా.. కాంపౌండ్
డీజీపీఎస్ సర్వే అనంతరం 2021లోనే కేయూ ల్యాండ్స్ కమిటీ సమగ్ర రిపోర్ట్ తయారు చేయగా.. ఈసీ మీటింగ్ లో ఆమోదిస్తే అక్రమార్కులపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ బాబు ఇల్లుతో పాటు మరికొందరి ఆక్రమణలు ఉండటం వల్లే ల్యాండ్స్ కమిటీ రిపోర్ట్ ను ఆమోదించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే వర్సిటీ భూములు ఆక్రమణలపై విద్యార్థి సంఘాలు మండిపడుతుండటం, పలుమార్లు నిలదీయడంతో ఈ నెల 10న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు సమక్షంలో దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో వర్సిటీ చుట్టూ కాంపౌండ్ నిర్మాణానికి వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ శంకుస్థాపన చేయించారు. అంతా క్లియర్ గానే ఉందనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి కూడా రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని కూడా చెప్పారు.
కానీ ఆక్రమణల విషయం ఎటూ తేల్చకుండా కాంపౌండ్ నిర్మించడం సాధ్యం కాని పనని స్పష్టమవుతోంది. పనులు ప్రారంభించాలంటే హద్దులు ముందుగా నిర్ణయించాల్సి ఉండగా.. ల్యాండ్ కమిటీ రిపోర్ట్ ను ఆమోదిస్తేనే ఆ ప్రక్రియకు అడుగులు పడే అవకాశం ఉంది. ముందుగా ఇవన్నీ చేయకుండా హడావుడిగా శిలాఫలకం వేయించడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి వర్సిటీ భూముల రక్షణ విషయాన్ని అధికారుల ఇంకెన్ని రోజులు లైట్ తీసుకుంటారో చూడాలి.
ఫిజికల్ సర్వే చేయాల్సి ఉంది
అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ స్థలం టైటిల్ ఛేంజ్ కాకపోవడం, ల్యాండ్ కమిటీ రిపోర్టు ఇంకా పెండింగ్ లో ఉన్న విషయం వాస్తవమే. వర్సిటీ భూములకు హద్దులు నిర్ణయించాలంటే ముందుగా ఫిజికల్ సర్వే చేయాల్సి ఉంది. ఈ మేరకు సర్వే కోసం ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు హద్దులు నిర్ణయించి, వర్సిటీ చుట్టూ కాంపౌండ్ నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ల్యాండ్ కమిటీ రిపోర్ట్ కు ఆమోదం తరువాతే కబ్జాదారులపై యాక్షన్ ఉంటుంది.
ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, రిజిస్ట్రార్, కాకతీయ యూనివర్సిటీ