విశ్వకర్మ యోజనతో బీసీల సమగ్రాభివృద్ధి : సూర్యపల్లి శ్రీనివాస్

విశ్వకర్మ యోజనతో బీసీల సమగ్రాభివృద్ధి : సూర్యపల్లి శ్రీనివాస్

గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేతి వృత్తుల మీదే ఆధారపడి ఉందన్నారు మేధావులు. గత పాలకులు దశాబ్దాలుగా వ్యవసాయానికి, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. గ్రామీణ, పట్టణ బీసీ చేతి, కుల వృత్తుల అభివృద్ధికి కనీస శ్రద్ధ పెట్టలేదు. దీనికి తోడు ఈ వృత్తిదారులు గ్రామంలోని ఒత్తిళ్లకు, కట్టుబాట్లకు లొంగి కుల వృత్తులకే  అంకితమయ్యారు. రోజువారీ పనితో వృత్తిపై ఉన్న అభిమానంతో వ్యవసాయానికి  దూరమై తమ ఆధీనంలోని భూములను కోల్పోయారు. దీనికి తోడు దేశంలో జరిగిన పారిశ్రామీకరణ, గ్లోబలైజేషన్ పోటీని తట్టుకోలేక, వృత్తులను వదులుకోలేక  పోతున్నారు. తరాలు అంతరించి పోయినా, వృత్తి నైపుణ్యాలను కాపాడుతూ , వాటిని భవిష్యత్ తరాలకు అందజేయాలనే ఆశతో  జీవనం సాగిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత దేశాన్ని  విశ్వగురువుగా, నరేంద్ర మోదీని  విశ్వనాయకుడిగా కీర్తిస్తున్నాయి. తన మూలాలు తెలిసిన ఎంబీసీ కులాలకు చెందిన నాయకుడిగా, పండిత్ దీన్ దయాళ్ జీ నేర్పిన ‘అంత్యోదయ’ సిద్ధాంతం ఆధారంగా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే మంత్రంతో పని చేస్తున్నారు. వేల సంవత్సరాలుగా దేశ  సంస్కృతి, వృత్తి నైపుణ్యాలను, హస్తకళలను కాపాడింది బీసీ కులాల వారేనని ప్రధాని మోదీ గుర్తించారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని గమనించి, బీసీల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని విశ్వకర్మ జయంతి రోజున ‘పీఎం విశ్వకర్మ యోజన’ ను ప్రారంభించారు. ఈ పథకంతో బీసీ చేతి, కుల వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వీరి నైపుణ్యాలను, హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తున్నారు.

వృద్ధి రేటు పెరుగుతుంది..

పీఎం విశ్వకర్మ యోజనలో భాగంగా..  దేశంలో మొదటి విడత కింత రూ.13 వేల కోట్లతో స్కీంను 2023–28 కాలంలో అమలు చేయనున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4.5 లక్షల కుటుంబాలకు మొదటి విడతలో లబ్ధి జరగనుంది. ఏ కులాలైతే సంప్రదాయ పద్ధతుల్లో వృత్తులను  కొనసాగిస్తున్నాయో ఆ కుటుంబాల్లోని వృత్తిదారుడికి ఆర్థిక రుణ సాయం, ఆధునిక నైపుణ్యా శిక్షణ, ఆ సమయంలో వసతి, భోజన సదుపాయంతో పాటు ప్రతి రోజు రూ .500  పారితోషకం, విశ్వకర్మ సర్టిఫికెట్, అధునాతన పనిముట్ల కిట్ అందజేస్తారు. వీటితో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ పథకంతో శిక్షణ పొందిన వృత్తిదారుడికి మొదటి విడత రూ . ఒక లక్ష రుణం అందిస్తారు. ఈ రుణం తీర్చిన తర్వాత రెండో విడతగా రూ.2 లక్షలు , తర్వాత రూ .3 లక్షలు ఐదు శాతం స్థిర వడ్డీతో హామీలు లేని లోన్​ ఇస్తారు. ఈ పథకంలో18 రకాల చేతి, కుల వృత్తిదారులు అర్హులు. ఈ వృత్తి కులాలను పరిశీలిస్తే వీరంతా భూమిలేని వృత్తి నైపుణ్యం కలిగిన ఎంబీసీలే. గత ప్రభుత్వాలకు, పాలకులకు దూరదృష్టి లేక, వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వక.. నిరాదరణకు గురైన కుల, చేతి వృత్తిదారుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ సంకల్పించారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా బీసీ కులాల్లోని  నైపుణ్యం కలిగిన వృత్తిదారులు ఆర్థికంగా పరిపుష్టి చెందుతారు. గ్రామీణ, పట్టణ భారత ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన వృద్ధిరేటు  ఏర్పడుతుంది. మన  దేశ హస్తకళలు, వృత్తి నైపుణ్యాలు, కళాకారులు, కళా ఖండాలు, ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది దేశ ఖ్యాతి, ప్రపంచ మార్కెట్ లో  మన వస్తువుల వాటా పెరుగుతాయి. ఇప్పటికే బీసీ, ఎంబీసీ, సంచార జాతులకు కేంద్రంలో , అనేక రాష్ట్రాల రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత  నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దీంతో ఈ వృత్తి కులాల గొంతుకలు చట్ట సభల్లో వినిపిస్తున్నాయి. పార్టీ పదవుల్లో కూడా ఈ వర్గాలకు  ప్రత్యేక భాగస్వామ్యం దక్కడం నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి  స్ఫూర్తి.

రెండు సమాంతర ప్రణాళికలు అవసరం

బీసీ కుల, చేతి వృత్తులను ప్రోత్సహించడమంటే కులవ్యవస్థను, కులవృత్తులను కాపాడటమేనా ? అనే ప్రశ్నలు  సమర్థనీయమైంది కావు. భారతదేశంలో కళానైపుణ్యం, వృత్తినైపుణ్యం వంశపారంపర్యంగా సంక్రమిస్తున్నది. కళలను, కళా సంపదను, కళాకారులను, వృత్తిదారులను బతికించుకోవాలి. ఆ కళాఖండాలను, నైపుణ్యాన్ని ప్రపంచీకరణ చేయడమే ముఖ్యఉద్దేశం. ఈ నైపుణ్య వృత్తులను ఆధునికీకరణ చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహకారమే ఏకైక మార్గం. గ్లోబలైజేషన్ సందర్భంలో అగ్రవర్ణాలు సైతం డ్రైక్లీనింగ్, బ్యూటీ పార్లర్, బ్యూటీ సలోన్  వంటి అనేక బీసీ కులాల వృత్తుల్లోకి  ప్రవేశించారు. ఇది ఎలా సాధ్యమైంది ? ప్రజాస్వామ్య దేశంలో  ఇప్పటికీ మెజార్టీ బీసీ కులాల వారు సాంప్రదాయ వృత్తులపై జీవనం గడుపుతున్నారు. ఇది గత పాలకుల అశాస్త్రీయ ప్రాధాన్యం వల్ల జరిగిన నష్టం. దేశ మానవవనరులు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. ఈ వర్గాలను అభివృద్ధి పథంలో నడపాలంటే 2 సమాంతర ప్రణాళికలు ఉండాలి.1.ఉచిత విద్య, వైద్యం, 2. వృత్తిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి.  వృత్తిని ఆధునికీకరించడం వల్ల మాత్రమే వృత్తిదారుల ప్రగతి సాధ్యమవుతుంది. వృత్తుల ఆధునికీకరణ ఆర్థిక వనరుల మీద ఆధారపడిన విషయం. ఆర్థిక సాయంతో పాటు స్కిల్, టెక్నాలజీ, నాలెడ్జ్, మార్కెటింగ్ తోడైతే వృత్తిని వేగంగా ఆధునికీకరించుకునే వీలు ఉంటుంది. కేంద్రం పీఎం విశ్వకర్మ యోజన ద్వారా వృత్తిదారుల సంపూర్ణ ఆర్థిక పరిపుష్టి కోసం ఆలోచనలు చేసింది. గ్రామీణ, పట్టణ స్థాయిలో వృత్తులను నమ్ముకొని జీవించే వాళ్లకు వృత్తిని ఆధునికీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. సాంప్రదాయ వృత్తులు, వృత్తిదారులు మార్పుచెంది - ఆధునిక నైపుణ్య వృత్తిగా, వృత్తి నైపుణ్యులుగా మారుతారు. తద్వారా వృత్తులు బతకడమే కాకుండా, వాటిపై ఆధారపడే కులాలు కూడా గౌరవప్రద జీవనం సాగించగలరు. కులం వల్ల వృత్తికి వచ్చిన అమానుష గుర్తింపులు, తక్కువ, ఎక్కువ తేడాలు కనుమరుగై పోతాయి. కులాల మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు కూడా పోతాయి.

- సూర్యపల్లి శ్రీనివాస్
స్టేట్ కన్వీనర్, రీసెర్చ్ అండ్ పాలసీ,
ఓబీసీ, బీజేపీ