సర్వేలో.. అన్నీ చెప్పాల్సిందే

సర్వేలో.. అన్నీ చెప్పాల్సిందే
  • చదువు, ఉద్యోగం, ఆస్తులు, అప్పులు
  • సర్వే ప్రామాణికంగానే అభివృద్ధి, సంక్షేమం
  • 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : త్వరలో జిల్లా 'సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల' సమగ్ర ముఖ చిత్రం ఆవిష్కరణ కానుంది. ఈనెల 6 నుంచి చేపట్టే 'సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే'ను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వ నిర్ణయాలు ఉండబోతున్నాయి. అందుకే ప్రతి కుటుంబం తనకున్న ఆస్తులతోపాటు తీసుకున్న అప్పులనూ చెప్పాల్సిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 6 నుంచి 15 రోజులపాటు ఈ సర్వే నిర్వహించనుంది. 

పదేండ్ల తర్వాత ఇంటింటికి..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో అప్పటి బీఆర్​ఎస్​ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఇది జరిగిన పదేండ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 'సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే' చేపట్టింది. సర్వే చేయాల్సిన ఇండ్లను ఈ నెల 6 నుంచి 8 వరకు గుర్తించనున్నారు. 9 నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. 150 ఇండ్లను ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ) తీసుకొని ఒక్కో ఎన్యుమరేటర్​కు అప్పగిస్తారు. 

రోజుకు పది ఇండ్ల చొప్పున 15 రోజుల్లో తనకు అప్పగించిన ఇండ్లలో ఎన్యుమరేటర్​సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్వే కోసం 75 ప్రశ్నలను రూపొందించారు. వీటిలో కులం, ఉప కులం, చదువు, చేస్తున్న ఉద్యోగం, ఆస్తులు, తీసుకున్న అప్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఈ సర్వే ద్వారా జిల్లాలో ఇండ్లు, జనాభా, ఇతర వివరాలు సమగ్రంగా అందుబాటులో ఉంటుంది. 

యాదాద్రిలో 2,47,354 ఇండ్లు..

యాదాద్రి జిల్లాలో మొత్తంగా 2,47,354 ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఇంటిని సర్వే చేయడం కోసం మొత్తంగా 1938 మందిని నియమించారు. 2011 జన గణన ప్రకారం జిల్లాలో 1746 ఎన్యుమరేషన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లు ఉండగా ప్రస్తుత జనాభా ప్రకారం 1800 బ్లాక్‌‌‌‌లు ఉన్నాయి. జిల్లాలోని 17 మండలాలకు ఎంపీడీవోలను, 6  మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. 

సూర్యాపేట జిల్లా..

సూర్యాపేట జిల్లాలో 3,37 లక్షల ఇండ్లు ఉన్నాయి. సర్వే కోసం 2063 మంది ఎన్యుమరేటర్లు, 263 మంది సూపర్ వైజర్లు నియమించారు.

నల్గొండ జిల్లా..

నల్గొండ జిల్లాలో 5.02 లక్షల ఇండ్లు ఉన్నాయి. 3,732 బ్లాకులుగా విభజించారు. నల్గొండ జిల్లాలో ఐదు వేల మంది సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు. 

సర్వేతో ఏ స్కీమ్​రద్దు కాదు : కలెక్టర్ హనుమంతరావు

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ఏ స్కీమ్​ రద్దు కాదు. కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టడానికి ఈ సర్వే ప్రామాణికంగా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. సర్వే సమగ్రంగా నిర్వహించాలి. ప్రొపార్మలోని ప్రతి ప్రశ్నకు ప్రతి కుటుంబం నుంచి సమాధానం ఎంట్రీ చేయాలి.