సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం

సమగ్ర కుటుంబ సర్వేకు  సర్వం సిద్ధం
  • నేటి నుంచే ఇంటింటి సర్వే షురూ
  • ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్లు 

జనగామ/ హనుమకొండ సిటీ, వెలుగు : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి నుంచి ప్రారంభంకానుంది. భవిష్యత్ లో సంక్షేమ పథకాల అమలుకు ప్రామాణికంగా తీసుకోనున్న ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల పరిధిలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లు, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రతి ఇంటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగనున్నారు. 

జనగామ జిల్లాలో కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 283 గ్రామ పంచాయతీలున్నాయి. మండలాల పరిధిలో లక్షా 46 వేల 428 కుటుంబాలు, జనగామ మున్సిపల్ పరిధిలో 16,084 కుటుంబాలున్నాయి. మొత్తంగా లక్షా 62 వేల 512 కుటుంబాలు ఉండనుండగా, 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ బ్లాక్ లను ఏర్పాటు చేశారు. ఈ లెక్కన మండలాల పరిధిలో 1036 బ్లాకులకు 1036 ఎన్యుమరేటర్లు, 104 మంది సూపర్ వైజర్లను నియమించారు. మున్సిపల్ పరిధిలో 123 బ్లాకులకు 123 మంది ఎన్యుమరేటర్లు, 13 మంది సూపర్ వైజర్లను నియమించారు. మొత్తంగా 1159 బ్లాకులకు 1159 మంది ఎన్యుమరేటర్లతోపాటు అదనంగా మరో పది శాతం మందిని రిజర్వ్ చేసి పెట్టారు. మొత్తంగా 1274 మంది ఎన్యుమరేటర్లతో సర్వేను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

వరంగల్ జిల్లాలో.. 2 లక్షల 63 వేలు 

వరంగల్ జిల్లాలో సుమారు 2 లక్షల 63 వేల కుటుంబాలు ఉండగా, అందులో జీడబ్ల్యూఎంసీ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్​అర్బన్ పరిధిలో 1,17,256 కుటుంబాలు, రూరల్ పరిధి 11 మండలాల్లోని 1,45,882 కుటుంబాలు సర్వే జాబితాలో ఉన్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. వీరిని మొత్తం 1841 గణన బ్లాకులుగా విభజించినట్లు చెప్పారు. సిబ్బందిపై 204 మంది పర్యవేక్షకులను నియమించి వారికి శిక్షణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

 గ్రేటర్ వరంగల్ సిటీలో.. :  గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2,90,969 గృహాలకు సంబంధించి 1674 మంది ఎన్యుమరేటర్లు, 168 మంది సూపర్ వైజర్లు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొంటారని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. ఒక్కో ఎన్యుమరేటర్ 90-175 గృహాల్లో సర్వే నిర్వహిస్తార పేర్కొన్నారు.

హనుమకొండ జిల్లాలో.. : జిల్లాలో సుమారు 3లక్షల కుటుంబాలు ఉండగా, 1916 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ప్రజలు సమగ్ర ఇంటింటి సర్వేకు అధికారులకు సహకరించాలని హనుమకొండ కలెక్టర్​ప్రావీణ్య కోరారు. 

మహబూబాబాద్ జిల్లాలో.. : జిల్లాలో 487 గ్రామపంచాయతీల పరిధిలో, 1330 ఆవాసాలు ఉన్నాయని కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్ తెలిపారు. ఇందులో 3997 వార్డుల పరిధిలో 216361 హౌస్ హోల్డర్లు, 1884 మంది ఎన్యుమ రేటర్లు, 186 మంది సూపర్ వైజర్లను నియమించినట్లు వివరించారు. 


భూపాలపల్లి జిల్లాలో.. : జిల్లాలో 12 మండలాలు, భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో కలిపి 1,31,030 ఇండ్లు సర్వే నిర్వహణకు 993 ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామాల్లో 842 మంది, పట్టణ ప్రాంతంలో 92 మంది, మరికొంత మందిని రిజర్వ్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 123 మంది పర్యవేక్షకులను నియమించినట్లు పేర్కొన్నారు.

ములుగు జిల్లాలో.. : జిల్లాలో సుమరు 87181 హౌస్ హోల్డ్స్ ఉన్నా ఉండగా,  980 బ్లాకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే కోసం 740 ఎన్యుమరేటర్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.

 ఇంటి వద్దకే..

సర్వేను నిర్వహించే ఎన్యుమరేటర్లు ఇంటివద్దకు వచ్చి వివరాలు సేకరించనున్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో ఎన్యుమరేట్ బ్లాక్​ల కోసం ఇండ్ల ఎంపిక జాబితాను సిద్ధం చేస్తారు. అనంతరం 75 ప్రశ్నలతో కూడిన ఫాంల పూర్తి ప్రక్రియను చేయనున్నారు. ఆస్తులు, అప్పులు, కులం, రాజకీయ పదవులు, ఉద్యోగం, ఆదాయం, కుటుంబ సభ్యులు తదితర వివరాలను సేకరించనున్నారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు కుటుంబాల యజమానులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భూములు ఉంటే పట్టాదారు పాసు పుస్తకం వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంటింటి సర్వే పూర్తి తదుపరి ఈనెల 30 వరకు డాటా ఎంట్రీ చేయనున్నారు.