- లిక్కర్ సేల్స్ తగ్గినయ్
- ఏపీ ఎఫెక్ట్‌తో బోర్డర్ షాపుల్లో పడిపోయిన డిమాండ్
- రూ.కోట్లు గుడ్ విల్ పెట్టి కొన్నోళ్లకు షాక్
- టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇబ్బందులు పడుతున్న ఎక్సైజ్ ఆఫీసర్లు
అతను జిల్లా సరిహద్దులో ఉన్న ఓ వైన్ షాపు లైసెన్స్‌ను డ్రాలో దక్కించుకున్నాడు. లక్కీ డ్రా జరిగిన రోజే మద్యం సిండికేట్ రూపంలో లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఆ రోజు, తర్వాతి రోజు వరకు జరిగిన బేరసారాల్లో చివరకు రూ.కోటిన్నర వరకు గుడ్ విల్ ఇచ్చేందుకు మద్యం వ్యాపారులు ముందుకు వచ్చారు. తానే సొంతంగా నడిపించుకుంటానంటూ ఆ ఆఫర్లను అతను రిజెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసి తలపట్టుకుంటున్నాడు. ఏపీలో మద్యం రేట్లు తగ్గడంతో అక్కడి నుంచి మద్యం ప్రియులు రావడం పూర్తిగా తగ్గడంతో లబోదిబోమంటున్నాడు. ఎంతో కొంత గుడ్ విల్ తీసుకొని లైసెన్స్ అమ్ముకున్నా బాగుండేది కదా అని బాధపడుతున్నాడు. ఇక గుడ్ విల్ తో బోర్డర్ వైన్ షాపులను తీసుకున్న వారిదీ ఇదే పరిస్థితి.
ఖమ్మం, వెలుగు: జిల్లాలో లిక్కర్ సేల్స్ క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది కంటే ప్రతి నెలా బీర్ల అమ్మకాల్లో ఎంతో కొంత గ్రోత్ కనిపిస్తున్నా, విస్కీ, ఇతర మద్యం అమ్మకాల్లో మాత్రం రెగ్యులర్‌గా నెగెటివ్ గ్రోత్ రికార్డు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు జరిగిన లిక్కర్ అమ్మకాల్లో ఒక్క మే నెలలో తప్పించి, మిగిలిన అన్ని నెలల్లో సేల్స్ తగ్గాయి. మొదటి ఏడు నెలలు కలిపి చూసుకుంటే గతేడాది కంటే ఇప్పుడు 11.80 శాతం మద్యం అమ్మకాలు పడిపోయాయి. అత్యధికంగా జులై నెలలో గతేడాది కంటే 26.23 శాతం లిక్కర్ అమ్మకాలు పడిపోయాయి. గతేడాది జులైలో 1,85,653 కేసుల లిక్కర్ అమ్ముడుపోగా, ఈసారి 1,36,949 కేసులు అమ్ముడయ్యాయి. సేల్ వాల్యూలో కూడా మే, జూన్ నెలల్లో ఈ ఏడాది భారీగా పెరిగిన బీర్ అమ్మకాల వల్ల పాజిటివ్ గ్రోత్ కనిపిస్తోంది. ఏడు నెలల సేల్ వాల్యూ తీసుకుంటే గతేడాది కంటే 1.41 శాతం తక్కువ అమ్మకాలు జరిగాయి. ఏడు నెలల్లో గతేడాది రూ.814,14,60,000 విలువైన అమ్మకాలు జరగ్గా, ఈసారి రూ.802,66,72,000 సేల్స్ జరిగాయి.
ఏపీలో లిక్కర్ రేట్లు తగ్గడమే కారణం..
లిక్కర్ సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణం ఏపీ నుంచి మద్యం తాగేందుకు ఇక్కడికి జనం రాకపోవడం, బోర్డర్ షాపుల నుంచి ఏపీకి అక్రమంగా గతేడాది జరిగినట్లు ఇప్పుడు మద్యం అక్రమ రవాణా జరగకపోవడమేనని తెలుస్తోంది. గతంలో ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో, సీక్రెట్ గా ఇక్కడి నుంచి ఏపీకి మద్యం తీసుకెళ్లి అమ్ముకునే వారు. బోర్డర్ షాపుల్లో ఇలా మద్యం సేల్స్ ఎక్కువగా జరుగుతాయన్న కారణంతో గతేడాది నవంబర్‌లో జరిగిన టెండర్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఎర్రుపాలెం మండలంలోని బోర్డర్ షాపు కోసం 117 టెండర్లు దాఖలయ్యాయి. ఇక టెండర్లలో షాపు దక్కించుకోలేక పోయిన వారు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు గుడ్ విల్ ఇచ్చి బోర్డర్ షాపులను లైసెన్స్ దారుల నుంచి కొనుక్కున్నారు. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఏపీలో లిక్కర్ రేట్లను అక్కడి ప్రభుత్వం తగ్గించింది. దీంతో మద్యం అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. ఇక ఇక్కడికి వచ్చి మద్యం తాగి వెళ్లేవారు కూడా తగ్గారు. ఈ ఎఫెక్ట్ సేల్స్ పై కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆఫీసర్లపై పెరుగుతున్న ఒత్తిడి..
ప్రతి నెలా టార్గెట్ రీచ్ అవ్వడం జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్లకు ఇబ్బందిగా మారుతోంది. గతేడాది ఇదే నెలలో జరిగిన సేల్స్ కంటే, ఈ ఏడాది కనీసం 10 శాతం ఎక్కువ సేల్స్ చేయడం టార్గెట్ గా ఉంటుంది. ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు వైన్ షాపు లైసెన్స్‌దారులపై ఆఫీసర్లు ఎక్కువ స్టాక్ తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారని లైసెన్స్‌దారులు చెబుతున్నారు. ఉన్న స్టాక్ అమ్ముడుపోకుండా, సేల్స్‌కు మించి ఎక్కువ స్టాక్ తీసుకొని తామేం చేయాలంటూ వాపోతున్నారు. మరోవైపు లిక్కర్ సేల్స్ పెంచుకునేందుకు గ్రామాల్లో బెల్టు షాపులను ఆఫీసర్లే ప్రోత్సహిస్తున్నారనే
విమర్శలున్నాయి.
ఏపీ నుంచి వచ్చేవారు తగ్గారు..
గతేడాది ఏపీలో మద్యం రేటు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది బోర్డర్ లో ఉన్న మండలాల్లోని జనం మన జిల్లాలోని మద్యం షాపులకు వచ్చి తాగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో రెగ్యులర్‌గా జరిగే అమ్మకాలే ఇప్పుడు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, వాడకాన్ని తగ్గించడం, గుడుంబా లేకుండా చేయడంపై మేం దృష్టి పెడుతున్నాం.
- నాగేందర్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం
పేద విద్యార్థికి ఆర్థికసాయం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారాయణ ఆర్థికసాయం అందించారు. కూసుమంచి మండలం రాజుపేట గ్రామానికి చెందిన పోలవరపు ప్రియాంక అమెరికాలోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించింది. ఈ నెల 5న అమెరికా వెళ్లాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఆయన ప్రియాంకను సత్కరించి రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. నంబూరు రామలింగేశ్వరరావు, రుద్ర ప్రదీప్, శ్యామ్ రాథోడ్, మంద సరస్వతి, చంద్రశేఖర్, అనంతు ఉపేందర్, వెంకట్, కోటేశ్వరరావు, శ్యామ్, లక్ష్మణ్ ఉన్నారు.
బిల్డింగ్ కూల్చివేత
వైరా, వెలుగు: పట్టణంలోని 13వ వార్డులో శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బుధవారం మున్సిపల్ ఆఫీసర్లు జేసీబీతో కూల్చివేశారు. భవనం కూలితే ప్రాణ నష్టం కలుగుతుందని యజమానికి తెలియజేశారు. పట్టణంలో శిథిలావస్ధలో ఉన్న భవనాలు ఉంటే
తమ దృష్టికి తేవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటపతిరాజు కోరారు. మున్సిపల్ ఏఈ అనిత, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్ ఉన్నారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి
పాల్వంచ,వెలుగు: తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కోలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్, ప్రకాష్ కోరారు. బుధవారం హైదరాబాద్ విద్యుత్ సౌదలో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందించారు. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు పీఆర్సీ త్వరగా ఇవ్వాలని, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరారు. ఎన్పీడీసీఎల్ లో 300 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కేటీపీఎస్ నాయకులు, జెన్కో సీనియర్ వర్కింగ్ ప్రెసి డెంట్ చారుగుండ్ల రమేశ్ పాల్గొన్నారు.
డ్రైనేజీ నిర్మాణానికి ఫండ్స్ మంజూరు
చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ ఎస్సీ బాలుర హాస్టల్ లో డ్రైనేజీ నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరైనట్లు జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.వెంకటేశ్ తెలిపారు. బుధవారం ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను విజిట్ చేశారు. వర్షాలతో హాస్టల్ లో చేరిన నీటిని పరిశీలించారు. మోటార్లతో నీటిని బయిటికి పంపేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మారావును ఆదేశించారు. హాస్టల్ ఆవరణలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. హాస్టల్ లో శానిటేషన్, బ్లీచింగ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జీపీ సెక్రటరీ ఉపేందర్ ఉన్నారు.
127 మంది బాల కార్మికులకు విముక్తి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఇళ్ల నుంచి తప్పిపోయి, పారిపోయి పరిశ్రమల్లో పని చేస్తున్న 127 మంది చిన్నారులను గుర్తించి రక్షిత గృహాలకు, తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నిరాదరణకు గురవుతున్న పిల్లలను గుర్తించి సంరక్షించే లక్ష్యంతో పోలీస్, చైల్డ్వెల్ఫేర్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. 8 డివిజన్లలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 99 మంది బాలురులను, 28 మంది బాలికలను గుర్తించినట్లు సీపీ తెలిపారు. 48 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దొరికిన చిన్నారుల్లో 22 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జిల్లాలోని 4 పోలీస్ డివిజన్లలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాలు కీలకపాత్ర పోషించాయని అన్నారు.
కుంగిన అప్రోచ్ రోడ్..ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు
బూర్గంపహాడ్,వెలుగు: తెలంగాణ, ఏపీ సరిహద్దులోని బూర్గంపహాడ్, వేలేరు గ్రామాల మధ్య ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో మంగళవారం రాత్రి రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలోని వేలేరు గ్రామం వైపు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. గమనించిన స్థానికులు ఆఫీసర్లకు సమాచారం ఆందించడంతో రాకపోకలు నిలిపేశారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఆఫీసర్లు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు.
వరద బాధితులకు దుస్తులు అందజేత
భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం సీతానగరం, బైరాగులపాడులోని వరద బాధితులకు జనహిత వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీజేపీ నేత ఉమామహేశ్వరి, దీప, వనతి, అపర్ణ,అభిలాష్ బుధవారం చీరలు, లుంగీలు, తువ్వాళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరదల్లో అన్నీ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి ఎర్రంరాజు బెహరా, నాగబాబు, చెరుకూరి సతీష్, కోటేశ్వరి, నక్కా కన్నయ్య పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మంత్రి పువ్వాడ
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఏపీ సీఎం జగన్‌ను దంపతులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సతీమణి వసంతలక్ష్మితో కలిసి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కలిశారు. ఈ నెల 20న జరగనున్న తన కొడుకు వివాహ పత్రికను సీఎంకు అందజేసి ఆహ్వానించారు. అంతకుముందు సీఎంను శాలువాతో సత్కరించారు.
అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని రాస్తారోకో
వైరా, వెలుగు: అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైరా మెయిన్‌రోడ్డుపై దివ్యాంగులు రాస్తారోకో చేపట్టారు. బుధవారం ఎంపీడీవో ఆఫీస్‌లో రుణాల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆన్లైన్లో 70 మంది దరఖాస్తు చేసుకోగా, మండలానికి ఒకే యూనిట్ మంజూరైందని ఆఫీసర్లు చెప్పడంతో దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్‌రోడ్డుపై గంట సేపు ఆందోళన చేయడంతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సీఐ టి సురేశ్, ఎస్సైలు యాయాతి రాజు, ఎస్ వీరప్రసాద్ అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. ఎంపీడీవో వెంకటపతిరాజు, తహసీల్దార్ ఎన్ అరుణ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సీపీఎం నేతలు దివ్యాంగులకు మద్దతు తెలిపారు.
భారీ వర్షంతో తెగిన చెరువు కట్ట..నీట మునిగిన పంట పొలాలు
దమ్మపేట, వెలుగు: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కినేపల్లి గ్రామంలోని చెరువు తెగి పంట పొలాలు నీట మునిగాయి. 100 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతింది. పొలాల్లో చెరువు నీరు చేరడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. చెరువు కట్ట పనులను నాసిరకంగా చేపట్టడంతోనే తెగిందని ఆరోపించారు. తమకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఖాళీ ప్లాట్లను గుర్తించి నివేదిక అందిస్తాం
ఖమ్మం రూరల్, వెలుగు: మండలంలోని మద్దులపల్లి గ్రామంలో 1997లో నిరుపేదలకు పంపిణీ చేయగా మిగిలిన ప్లాట్లను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ సుమ తెలిపారు. మిగిలిన ప్లాట్లను కొందరు నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత ఏటుకూరి సుధాకర్రావుకలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఆర్డీవో, తహసీల్దార్ మోడల్ కాలనీని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పంపిణీ చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఆర్ఐ కల్యాణి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏటుకూరి సుధాకర్, అంజయ్య, గురునారాయణ ఖాళీ ప్లాట్లను అధికారులకు చూపించారు.
నిర్మాణ పనుల్లో క్వాలిటీ ఉండాలి
మధిర, వెలుగు: అభివృద్ధి పనుల్లో క్వాలిటీ పాటించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద జరుగుతున్న పార్కు వర్క్స్, పెద్ద చెరువు ట్యాంక్ బండ్, రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో స్పీడ్‌గా నాణ్యత లోపించకుండా చేయాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో మిస్సింగ్ సర్వే నెంబర్ల ఆప్షన్ సరి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్టీపీ నాయకులు షేక్ మస్తాన్పాషా కలెక్టర్‌ను కోరారు. మున్సిపల్ చైర్మన్ ఎం లత, కమిషనర్ రమాదేవి, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ రాంబాబు పాల్గొన్నారు.
విద్యుత్ అధికారులపై విజిలెన్స్ విచారణ
కామేపల్లి, వెలుగు: మండలంలోని కొత్త లింగాల విద్యుత్ ఆఫీసర్లపై బుధవారం విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్లు తమను ఇబ్బందులు పెడుతూ ప్రతీ పనికి డబ్బుల కోసం వేధిస్తున్నారని పలువురు ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయ న కరీంనగర్ విద్యుత్ విజిలెన్స్ డీఈ, ఏడీఈలను విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాధితులను కలిసి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేయడంతో పాటు విద్యుత్ మీటర్ల ఏర్పాటు విషయంలో జరిగిన అక్రమాలను గుర్తించారు. విద్యుత్ ఆఫీసర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి నివేదికను అందిస్తామని వారు తెలిపారు.
ఆసరా పెన్షన్లు ఇవ్వాలని వినతి
భద్రాచలం, వెలుగు: ఆసరా పెన్షన్లు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని బుధవారం బీజేపీ నాయకులు భద్రాచలం స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ జడ్పీ సీఈవో నాగలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. వరదల సమయంలో సర్వం కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వృద్ధులను ఆదుకోవాలని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ములిశెట్టి రామ్మోహన్రావు కోరారు.
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు నివాళి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య రెండో వర్ధంతి సందర్భంగా బుధవారం సీపీఎం లీడర్లు నివాళులు అర్పించారు. అంబేద్కర్ సెంటర్లో రాజయ్య స్తూపం వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో సభ జరిగింది. ప్రజల కోసం నిరంతరం పోరాడిన రాజయ్య జనం గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు. మూడుసార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా పని చేసిన రాజయ్య నిరాడంబర జీవితం గడిపారని గుర్తు చేశారు.
10 లోగా బస్తీ దవాఖానాలు ప్రారంభించాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఈ నెల 10 లోగా బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో పట్టణ ప్రగతిపై బుధవారం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు బిల్డింగ్‌లను గుర్తించాలని సూచించారు. కరకవాగులో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసిన పాల్వంచ మున్సిపల్కమిషనర్ శ్రీకాంత్‌ను అభినందించారు. సిబ్బంది, స్వచ్ఛ వెహికల్స్ ఉన్నా తడి, పొడి చెత్త సేకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్త్రీ నిధి రుణాల రికవరీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యంపై పబ్లిక్ హెల్త్ ఈఈ, కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్పర్సన్ కె. సీతాలక్ష్మి, పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్లు అర్జున్, డాక్టర్ పురంధర్, మున్సిపల్ కమిషనర్లు శ్రీకాంత్, అంకూషావలి, మాధవి పాల్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలి
గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రధాన రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్ పనులను తనిఖీ చేస్తానని చెప్పారు. హాస్టళ్లలో సరుకులను పరిశీలించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్ పాల్గొన్నారు.
ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు
టేకులపల్లి, వెలుగు: మండలంలోని కుంటల్లలో లంబాడాల ఆక్రమణలో ఉన్న భూములపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆదివాసీ ఐక్య కార్యచరణ సమితి జిల్లా ప్రెసిడెంట్ వాసం రామకృష్ణదొర తెలిపారు. బుధవారం ఆదివాసీ రైతులైన తొలెం మల్లయ్య, దనసరి ఎర్రమ్మ, ఆదెం లక్ష్మయ్యకు అనుకూలంగా తీర్పు రావడం హర్షణీయమన్నారు.
కలెక్టరేట్ పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పాలనా సౌలభ్యం కోసం రూ.44 కోట్లతో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. పనులను పరిశీలించి, పనులు స్లోగా జరుగుతుండడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వచ్చి పరిశీలించిన సమయంలో పనులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి లేదని, ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఆఫీసర్లను నిలదీశారు. ఇప్పటికే మొయిన్ బిల్డింగ్ స్లాబ్పనులు పూర్తి కాగా, సివిల్ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులను స్పీడప్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ మంత్రి వెంట ఉన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని మంత్రి పువ్వాడ చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల కేజీబీవీలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాయని అన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.