హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపాల పుట్టే నని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయని, 2019లోనే మేడిగడ్డ దెబ్బతిందని వెల్లడించింది. భూకంప జోన్లో మల్లన్నసాగర్‌ను నిర్మించారని, ఇక్కడ కనీసం సర్వే చేయ కుండానే రూ.6 వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొంది. కేవలం కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోళ్లలోనే రూ.2,600 కోట్ల అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చారని తప్పుబట్టింది. డీపీఆర్ ఓకే కాకముందే కాంట్రాక్ట్ సంస్థకు రూ. 25వేల కోట్ల పనులు అప్పజెప్పారని తెలిపింది. కాళేశ్వరంపై కాగ్ రూపొందించిన నివేదికను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కేసీఆర్ డ్రీమ్ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న ఈ కాళేశ్వరంలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని, 52 పైసల ఆదాయానికి ఏకంగా ఒక్క రూపాయి ఖర్చు చేశారని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోను ఎక్కువ చేసి చూపించారని, అసలు ప్రాజెక్టు ద్వారా సమకూరే ఆదాయమే తక్కువ కాబట్టి అప్పులు, వడ్డీల భారం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుందని, ఇది గుదిబండ అని పేర్కొంది. కరెంట్ బిల్లులకే ఏటా రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. లోన్ల రీపేమెంట్లు, ఇతర ఖర్చులు లెక్కేస్తే ఏటా ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.24 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇట్ల 2035 సంవత్సరం వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్లను కూడా దారి మళ్లించారని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ నిర్మాణం వ్యయం మూడేండ్లలోనే డబుల్అయిందని కాగ్ తేల్చింది. 2016 ఆగస్టులో రూ.1,849.31 కోట్ల అంచనాలతో పనులను అప్పగించగా.. నిర్మాణం పూర్తయ్యే సరికి ఖర్చు రూ. 4,321.44 కోట్లకు పెంచేశారని, అగ్రిమెంట్‌తో పోల్చితే ఖర్చు రూ.2,472.13 కోట్లు పెంచేశారని తెలిపింది.
కాగ్ రిపోర్టులోని మరిన్ని కీలక అంశాలు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులోని 7, 9, 12, 13, 14, 16, 17, 21 ప్యాకేజీలను రీ ఇంజనీరింగ్ చేయడంతో అప్పటికే చేపట్టిన పనులకు చేసిన ఖర్చు రూ.428.91 కోట్లు వృథా అయ్యాయి. 23 నుంచి 26 ప్యాకేజీలను తొలగించడంతో అక్కడ ఖర్చు చేసిన రూ.170.59 కోట్లు వృథా అయ్యాయి. ప్యాకేజీ –5లో ఖర్చు చేసిన రూ.168.28 కోట్లలో కొంత వృథా అయింది.
రీ ఇంజనీరింగ్ తర్వాత మల్లన్న సాగర్ పంపు హౌస్, సర్జ్ పూల్ ను 5.5 కి.మీ.ల దూరం మార్చడంతో అప్పటికే ఖర్చు చేసిన రూ.174.19 కోట్లు వృథా అయ్యాయి.
తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను సింగరేణి సంస్థ అభ్యంతరంతో ఐదో ప్యాకేజీ వద్ద నిలిపి వేశారు. ఆ పనులను ఏ ఇతర అవసరాలకు వినియోగించకపోవడంతో రూ.767.78 కోట్లు వృథా అయ్యాయి. రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో ఈ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కే 46.82 శాతం ఇవ్వాల్సి ఉంటుంది.. అది సాధ్యం కాదు కాబట్టి ప్రాజెక్టుకు అవసరమయ్యే కరెంట్ లో 60 శాతం బయటి నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అవసరం లేకున్నా అడిషనల్ టీఎంసీ పనులు చేపట్టి రూ.28,151 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇరిగేషన్రికార్డుల్లో, పనుల అంచనాలలో పంపింగ్కెపాసిటీ పెంపు అవసరంపై ఎలాంటి శాస్త్రీయ విశ్లేషణ లేదు. కాళేశ్వరం వ్యయం రూ.63,352 కోట్ల నుంచి రూ.1,02,267.99 కోట్లకు పెరిగింది. ఇంకా చేపట్టాల్సిన పనులను కలుపుకుంటే ఈ మొత్తం రూ.1,06,187.15 కోట్లకు చేరుతుంది. సీడబ్ల్యూసీఈ అప్రూవ్డ్ చేసిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం (రూ.81,911.01 కోట్ల)తో పోలిస్తే ప్రాజెక్టు అంచనాలు రూ.1,47,427.41 కోట్లకు మించి పోయే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేయడంతో ప్రాణహిత కోసం అప్పటికే చేసిన రూ.767.78 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించగా కాళేశ్వరంతో అది 50 వేల ఎకరాలకు తగ్గింది. ప్రాణహిత పనులను కాళేశ్వరంలో కలపడానికి అత్యుత్సాహం చూపిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్.. 2018లో ఈ ప్రాజెక్టు డీపీఆర్ ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే రూ.25,049.99 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీలోని మాసాని చెరువు నుంచి పడకంటి, మంచిప్ప, కొండెం చెరువులకు నీళ్లు తరలించి అక్కడి నుంచి 1.84 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందించేందుకు రూ.940.14 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. పైప్డ్ఇరిగేషన్సిస్టం (పైపుల ద్వారా నీటి తరలింపు)ను ఇక్కడ అమలు చేయడం ద్వారా రూ.2,248 కోట్లకు ఖర్చు పెంచారు. కాల్వ వందేండ్ల పాటు సేవలందిస్తే, పైపులైన్లైఫ్టైం 30 ఏండ్లు మాత్రమే. తద్వారా ఇక్కడ ఖర్చు చేసే మొత్తం భారంగా మారుతుంది. సబ్స్టేషన్లు, ఇతర ఖర్చులను కలుపుకుంటే 21వ ప్యాకేజీ వ్యయం రూ.3,321 కోట్లకు పెరిగింది. ప్రాణహితలోని 10, 11, 12 ప్యాకేజీలను కాళేశ్వరంలోని లింక్–4లో భాగంగా మార్చారు. 2019లో రూ.12,594.78 కోట్లతో ఈ పనులకు ఆమోదం తెలుపగా.. తర్వాత రూ.14,402 కోట్లకు అంచనాలు పెంచారు. తద్వారా రూ.1,807.22 కోట్ల ఖర్చు పెరిగింది. సొరంగాల లైఫ్‌టైం వందేండ్లు. కిలోమీటర్ సొరంగం తవ్వకానికి రూ.86 కోట్ల నుంచి 91 కోట్లు ఖర్చవుతుంది. ప్రెజర్‌మెయిన్(పైప్‌లైన్) లైఫ్‌టైం 30 ఏండ్లు మాత్రమే. ప్రెజర్మెయిన్నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ. 225 కోట్ల నుంచి 251 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో సొరంగాలకు బదులుగా ప్రెజర్మెయిన్స్నిర్మాణాలు చేపట్టడంతో రూ.3,726.91 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి రివర్స్పంపింగ్చేయడానికి ప్రతిపాదించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు సమర్థించుకోలేనిది. ఇలా ఎస్సారెస్పీకి ఏటా 60 టీఎంసీలను లిఫ్ట్చేయడానికి రూ.141.52 కోట్ల కరెంట్బిల్లులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,999.56 కోట్లు ఖర్చు చేయడం కూడా సమర్థనీయం కాదు.
రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు మల్లన్న సాగర్ మీదుగా కాల్వ తవ్వడానికి 2018లో రూ.44.42 కోట్లతో పనులు చేపట్టగా 2020 మార్చిలో పని పూర్తి చేసే నాటికి వ్యయం రూ.60.22 కోట్లకు పెరిగింది. ఈ కాల్వకు నీళ్లు ఇవ్వడానికి రూ.2.83 కోట్లతో తూము, ఇతర నిర్మాణాలు చేశారు. మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తి కావడంతో ఆ కాల్వ అందులో మునిగిపోయి రూ.63.05 కోట్లు వృథా అయ్యాయి. కాళేశ్వరంతో పాటు తెలంగాణలోని ఇతర లిఫ్ట్స్కీములకు కరెంట్అవసరాలు, ఇతర రంగాల కరెంట్అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18,25,700 ఎకరాలు సాగులోకి తెస్తామని ప్రతిపాదించినా 14,82,552 ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ప్రతిపాదించారు. మిగిలిన 3,43,148 ఎకరాలకు నీళ్లు అందించే వ్యవస్థను ప్రతిపాదించాల్సి ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతలకు అవసరమైన ట్రాన్స్మిషన్లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.2,885.84 కోట్లు ఖర్చవుతాయని డీపీఆర్‌లో పేర్కొనగా పెరిగిన లిఫ్టులతో ఈ వ్యయం రూ.6,594.02 కోట్లకు పెరిగింది.
డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు కోసం 1,06,751 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇందుకు రూ.6,953.65 కోట్లు కేటాయించారు. 2022 మార్చి నాటికి 63,972.16 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.5,510.32 కోట్లు ఖర్చు చేశారు. సగటున ఒక్కో ఎకరానికి రూ.8.61 లక్షల ధర చెల్లించినా మిగిలిన 42,778.84 ఎకరాలు సేకరించేందుకు ఇంకా రూ.3,683.26 కోట్లు అవసరం. కొత్తగా నిర్మించే ఐదు రిజర్వాయర్లలో 20 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఆయా గ్రామాల్లోని నిర్వాసితుల పునరావసం, ఇతర పనులకు రూ.1,464.34 కోట్లు కేటాయించారు. 2022 మార్చి నాటికి ఆర్అండ్ఆర్కోసం రూ.1,238.60 కోట్లు ఖర్చు చేశారు. మిగతా గ్రామాల్లో ఆర్అండ్ఆర్అమలు కోసం రూ409.77 కోట్లు అవసరమని లెక్కగట్టగా ఇది ఇంకో రూ.200 కోట్లు పెరగవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 180 టీఎంసీలు ఎత్తిపోయడానికి 14,687.83 మిలియన్‌యూనిట్ల కరెంట్అవసరం కాగా ఒక్కో యూనిట్‌కు రూ.3 ఖర్చవుతుందని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. లిఫ్ట్‌లకు ఒక్కో యూనిట్‌కు రూ.6.40కు కరెంట్సప్లయ్చేస్తున్నారు. డీపీఆర్‌లో కరెంట్‌బిల్లుల భారం రూ.4,148.80 కోట్లుగా పేర్కొనగా అది రూ.9,400.21 కోట్లకు పెరుగుతుంది. కరెంట్ఫిక్స్డ్చార్జీలను కలుపుకుంటే ఇది రూ.10,374.56 కోట్లకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్ల వద్ద కాస్ట్ బెనిఫిట్ రేషియోను ఒక రూపాయి ఖర్చు చేస్తే రూ.1.51 ఆదాయం సమకూరుతుందని చూపించారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, అవసరం లేకున్నా అడిషనల్టీఎంసీ పనులు చేపట్టడంతో రూపాయి ఖర్చు చేస్తే 52 పైసల ఆదాయం మాత్రమే సమకూరనుంది. ప్రాజెక్టు డీపీఆర్‌లోనూ కాళేశ్వరం నీటితో పంట ఉత్పత్తులను గణనీయంగా పెంచి చూపించారు. వరి దిగుబడి 4 వందల శాతం, మొక్కజొన్న, జొన్న ఉత్పత్తి 300 శాతానికి పైగా, పెసలు, మినుములు 120 శాతం, సోయా 122 శాతం, పత్తి 133 శాతం, వేరుశనగ 166 శాతంగా ఉంటుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్స్అండ్మెయింటనెన్స్ కోసం ఏటా రూ.272.70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024 -–25లో కాళేశ్వరం లోన్ల రీపేమెంట్, కరెంట్బిల్లులు, ఓ అండ్ఎం కలిపి రూ.25,109.41 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కాగ్ పేర్కొంది.
Also read : ఇండియాలో త్వరలో టెస్లా సోలార్ రూఫ్‌టాప్‌లు!
ఇంజనీర్లు చెప్పినా వినలే..!
మేడిగడ్డ బ్యారేజీ డిశ్చార్జ్ కెపాసిటీ 80 వేల క్యూమెక్కులతో, అన్నారం డిశ్చార్జ్ కెపాసిటీ 65 వేల క్యూమెక్కులతో, సుందిళ్ల డిశ్చార్జ్ కెపాసిటీ 57 వేల క్యూమెక్కులతో డిజైన్‌చేశారు. వీటికి ఇరిగేషన్డిపార్ట్మెంట్పరిధిలోని సెంట్రల్డిజైన్స్ఆర్గనైజేషన్సీఈ ఆమోదం తెలిపారు. 2019లో వర్షాకాలం తర్వాత నవంబర్‌లో బ్యారేజీల గేట్లు మూసిన తర్వాత ఆర్సీసీ వియిరింగ్కోట్స్, సీసీ కర్టెన్‌వాల్, బ్యారేజీ దిగువన ఉన్న సీసీ బ్లాకులు నదిలోకి కొట్టుకుపోయి రూ.180.39 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. బ్యారేజీల నిర్దేశిత వరద సామర్థ్యం మేరకు ఆయా నిర్మాణాలు చేపట్టకపోవడంతోనే కొట్టుకుపోయాయని, వాటిని సరి చేయాలని నిర్మాణ సంస్థలను ప్రాజెక్టు ఇంజనీర్లు కోరగా.. ఆయా పనులు చేపట్టడానికి వర్క్ఏజెన్సీలు ముందుకు రాలేదని పేర్కొంది. డిపార్ట్మెంట్ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేశామని, పైగా వాటికి క్వాలిటీ సర్టిఫికెట్లు కూడా ఇష్యూ చేశారని ఏజెన్సీలు తెలిపాయని రిపోర్టులో కాగ్ వివరించింది. ఇంజనీర్లు వాటి పునరుద్దరణకు రూ.470.03 కోట్లతో అంచనాలు రూపొందించారని.. లాంచింగ్అఫ్రాన్లు, సీసీ బ్లాకులు లోపభూయిష్టమైన డిజైన్లతో నిర్మించడంతోనే వాటి నిర్మాణ వ్యయం వృథా అయిందని తప్పుబట్టింది.
భూకంప జోన్లో మల్లన్న సాగర్
50 టీఎంసీల కెపాసిటీ తో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాంతంలో ఎన్ జీఆర్ఐ ప్రాథమిక సర్వేలో డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్ట్ (లోతులో నిటారు పగుళ్లు) ఉన్నట్టుగా తేలింది. ఇక్కడ భూకంప ప్రభావం స్టడీ చేయాలని ఎన్జీఆర్ఐ 2016 ఆగస్టులోనే ఇరిగేషన్డిపార్ట్మెంట్కు సూచించింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.6,126.80 కోట్లు ఖర్చు చేసింది. దక్షిణ భారతదేశం భూకంప జోన్-2 (అతి తక్కువ భూకంప ప్రభావం ప్రాంతం)లో ఉందని, అయినా సమగ్రమైన అధ్యయనం చేపట్టకుండా పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఎన్జీఆర్ఐ అప్పట్లో సూచించింది. 1967లో కోయినా భూకంపం, 1993లో లాతూరు భూకంపం, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో వచ్చిన భూకంపం, 1969లో భద్రాచలం వద్ద, 1983లో హైదరాబాద్సమీపంలో మేడ్చల్వద్ద సంభవించిన భూకంపాల తర్వాత దక్షిణ భారతదేశంలోనూ వాటి తీవ్రత అధికంగా ఉంటుందని, నష్టం భారీగానే ఉండనుందని ఎన్జీఆర్ఐ హెచ్చరించింది. మేడ్చల్మల్లన్నసాగర్నిర్మాణ ప్రాంతం నుంచి 20 కి.మీ.ల దూరంలో ఉందని ఎత్తిచూపింది. ఎన్జీఆర్ఐ ఇంత చెప్పినా.. భూకంప జోన్లోనే మల్లన్నసాగర్‌ను కట్టారని కాగ్ ఆక్షేపించింది.
తనిఖీలు చేసే దిక్కు లేదు
2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి డిజైన్ లోపంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌ను గాలికి వదిలేయడమే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని కాగ్ తెలిపింది. ‘‘వర్షాకాలం ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత బ్యారేజీల వద్ద కనీస తనిఖీలు చేపట్టలేదని, 2019లోనే లోపాలు బయట పడినా వాటికి రిపేర్లు చేయకపోవడంతో బ్యారేజీ కుంగిందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు ఉన్నాయని గుర్తించింది” అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
ఉత్తపుణ్యానికి చెల్లింపులు
- కాళేశ్వరం నాలుగో లింక్ లోని టన్నెల్ నిర్మాణం కోసం అగ్రిమెంట్ కు మించి కాంట్రాక్టర్ కు రూ.62.82 కోట్లు చెల్లించారు.
- రీ ఇంజనీరింగ్ తర్వాత ప్యాకేజీ –14ను పూర్తిగా పక్కన పెట్టారు. అప్పటికే ఆ ప్యాకేజీకి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ కు మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించారు. కాంట్రాక్టర్ డిపార్ట్ మెంట్ కు రూ.31.04 కోట్ల బ్యాంక్ గ్యారంటీ గా ఇచ్చారు. ఆ మొత్తం నగదుగా మార్చుకోలేదు.
- ప్రాణహిత – చేవెళ్ల రీ ఇంజనీరింగ్ తర్వాత 23, 24, 25, 26 ప్యాకేజీలను పూర్తిగా తొలగించారు. ఆయా ప్యాకేజీలకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.64.05 కోట్లకు గాను రూ.44.57 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టారు. మిగతా రూ.19.48 కోట్లు కాంట్రాక్టర్ల నుంచి రాబట్టలేకపోయారు.
- ప్యాకేజీలు 6,8,10, 11, 12 కింద సివిల్, ఎలక్ట్రో, హైడ్రో మెకానికల్ పరికరాల కొనుగోలు, ఆయా పనులకు 13 ఏండ్ల పాటు ఓ అండ్ ఎం కోసం ముందస్తుగా రూ.70.26 కోట్లు చెల్లించారు. వాటిలో 2022 జనవరి నాటికి రూ.47.26 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్ల నుంచి రాబట్టారు.
- సిమెంట్, స్టీల్ , పెట్రోల్, ఆయిల్ ఇతర మెటీరియల్ లో ధరల వ్యత్యాసం పేరుతో కాంట్రాక్టర్లకు రూ.529.39 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.16.91 కోట్ల అదనపు చెల్లింపులు చేశారు.
- ప్యాకేజీ –9లోని టన్నెల్లో కాంక్రీట్బ్యాక్ ఫిల్ చేయకుండా పనులను వదిలేశారు. కాంట్రాక్టర్ నుంచి ఆ పనులకు చేయాల్సిన వ్యయాన్ని రాబట్టాలి. ఇలా రూ.8.29 కోట్లు రాబట్టలేకపోయారు. ఇదే ప్యాకేజీలో కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు రూ.26.34 కోట్లు అదనంగా చెల్లించారు. తద్వారా కాంట్రాక్టర్ కు అనుచిత లబ్ధి కలిగించారు.
- మేడిగడ్డ బ్యారేజీ అప్రోచ్ రోడ్డు వల్ల నిర్మాణ వ్యయం రూ.66.29 కోట్లు పెరుగగా ఇందులో 2022 జనవరి వరకు రూ.44.42 కోట్లు చెల్లించారు. ఇలా అవనవసర చెల్లింపులు చేసి కాంట్రాక్టర్ కు లాభం చేకూర్చారు. ప్యాకేజీ –9లోని గ్రావిటీ కెనాల్ 29.50 కి.మీ.లుగా పేర్కొనగా 24.92 కి.మీ.లు మాత్రమే పనులు చేశారు. కానీ పూర్తి కాలువకు చెల్లింపులు చేశారు. తద్వారా రూ.5.69 కోట్లు అదనంగా చెల్లించారు... పై వివరాలన్నీ కాగ్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
లోన్లను దారి మళ్లించారు
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేఐపీసీఎల్ద్వారా 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్ల లోన్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా తీసుకునేందుకు అగ్రిమెంట్చేసుకున్నారు. ఈ లోన్లకు 7.8 శాతం నుంచి 10.9 శాతం వడ్డీ చెల్లించేలా అగ్రిమెంట్లలో పేర్కొన్నారు. 2022 మార్చి నాటికి రూ.64,283.40 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా తీసుకున్న లోన్ల రీ పేమెంట్లను వాయిదా వేయడంతో అదనపు వడ్డీ భారం రూ.8,182.44 కోట్లు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విజయ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1,500 కోట్లను దారిమళ్లించారని కాగ్ తప్పుబట్టింది. కాడా (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) అప్పటికే సేకరించిన 19,570 ఎకరాల భూమిని కాళేశ్వరం ప్రాజెక్టుకు బదలాయించారని తెలిపింది. లోన్లు తీసుకున్న మొత్తాన్ని అప్పటికే సేకరించిన భూమికి ఖర్చు చేసినట్టుగా చూపించారని, నాలుగేండ్లయినా ఆ భూమిని వినియోగించలేదని, లోన్‌ను మళ్లించడంతో రూ.587.65 కోట్ల వడ్డీ భారం పడిందని పేర్కొంది.
నాబార్డు నుంచి తీసుకున్న రూ.190.09 కోట్ల లోన్‌ను ఇలాగే మళ్లించారని కాగ్ తప్పుబట్టింది. ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ప్రకారం లోన్లకు మార్జిన్‌మనీగా రూ.9.522.12 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉండగా.. 2022 మార్చి నాటికి 4,074.57 కోట్లు మాత్రమే రిలీజ్చేశారు. తద్వారా కార్పొరేషన్నుంచే కొంత మొత్తం మార్జిన్‌మనీగా చెల్లించారు. తద్వారా రూ.1,381.42 కోట్ల అదనపు వడ్డీ భారం పడింది. కాళేశ్వరం తీసుకున్న లోన్రూ.87,369.89 కోట్లు కాగా దానికి రూ.54,174.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2035 – 36 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.