![అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే.... కోర్టు ఆదేశించినాఅమలు చేయరా?](https://static.v6velugu.com/uploads/2025/02/compulsery-falldown-illegal-buildings--say-highcourt_1E6gGMFKaI.jpg)
- మున్సిపల్ అధికారులపైహైకోర్టు ఆగ్రహం
- తాజా నివేదికసమర్పించాలని ఆదేశం
- గచ్చిబౌలిలో 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నంబర్ 51 నుంచి 53 దాకా ఉన్న భూముల్లో అక్రమ, అనుమతుల్లేని నిర్మాణాలను కూల్చాల్సిందే అని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తాజా నివేదికను సమర్పించాలంటూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌కు హైకోర్టు శుక్రవారం సూచించింది. గత ఉత్తర్వుల ప్రకారం.. అక్రమ నిర్మాణాలు కూల్చలేదని, నిర్లక్ష్యం వహిస్తే హైకోర్టు తన విచక్షణాధికారాలను వినియోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కోర్టుల ప్రతిష్ట, గౌరవాన్ని, అధికారాలను నిలబెట్టడం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలుకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన బాధ్యత కమిషనర్‌దే అని తేల్చింది. విధులు నిర్వహించడంలో కమిషనరే విఫలమైతే.. వాటిని ఎవరు నిర్వర్తిస్తారని నిలదీసింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
గచ్చిబౌలిలో 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు నోటీసులిచ్చినప్పటికీ.. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎం.యాదయ్య హైకోర్టులో గతంలో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ భూముల్లో పలు సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను చట్టప్రకారం తొలగించాలని 2022 జులైలో ఆదేశించినా అమలు చేయకపోవడంతో యాదయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై శుక్రవారం జస్టిస్ సీవీ.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. స్టేటస్ కో ఉత్తర్వులున్నా అనుమతుల్లేకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగించడానికి అధికారులు అనుమతించారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కౌంటరు దాఖలు చేస్తూ.. ఎలాంటి అనుమతుల్లేని నిర్మాణాలను అనుమతించలేదనడంతో తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయాలని గతేడాది ఆగస్టు 30న ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవడంతో జనవరి 10న అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆన్‌లైన్‌లో హాజరై భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో గానీ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలోగానీ తన పాత్ర లేదని చెప్పడంతో జడ్జి స్పందిస్తూ.. ప్రతివాదిగా ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందన్నారు.
తదుపరి హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసినా.. సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా అనధికారిక నిర్మాణాలను అధికారులు అనుమతించారని, వాటికి నోటీసులు ఇచ్చి చట్టప్రకారం తొలగించడంలేదని వ్యాఖ్యానించారు. ఇది జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం విధుల నిర్వహణలో నిర్లక్ష్యమేనని, అంతేగాకుండా సుప్రీంకోర్టు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి, రాజేంద్రకుమార్ బర్జాత్యా వర్సెస్ యూపీ ఆవాస్ ఇవం వికాస్ పరిషద్ కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వుల ఉల్లంఘించడమేనన్నారు.
స్టేటస్కో ఉన్నప్పుడు.. నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. కోర్టును తక్కువ అంచనా వేయొద్దన్నారు. అవసరమైతే కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ధనవంతులకు ప్రత్యేక చట్టం ఉన్నట్లు అధికారులు వ్యవహరిస్తారన్నారు. అదే పేదలు చిన్నస్థలంలో వేసుకున్న గుడిసెలను తొలగిస్తారని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో మాత్రం పెద్దల అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తారని జడ్జి ఫైర్ అయ్యారు. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించారు.