రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్న సామె తుంది. అలాగే హైదరాబాద్ మహానగరం కూడా స్వల్పకాలంలో మహాద్భుత నగరంగా నిర్మితమైంది కాదు. ఈ మహా నగరానికి ఐదువందలేండ్ల చరిత్రుంది. పేదల నుంచి బిలియనీర్లు, ట్రిలియనీర్ల వరకు అంతా నివసించడానికి అనువైన పరిస్థితులున్న నగరరాజం హైదరాబాద్. ఐదువందలేండ్లుగా హైదరాబాద్ దక్కన్‌కు, యాభై ఎనిమిది సంవ త్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, గత పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లుతున్న భాగ్యనగరం. నాలుగు వందలేండ్లు కుతుబ్‌షాహీ వంశం, ఆసఫ్‌జాహీ వంశ ముస్లింరాజుల పాలనలో క్రమక్రమాభివృద్ధి చెందిన ప్రాంతం. ఓరుగల్లు కేంద్రంగా సువిశాల సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయ రాజుల ఊరూరికి చెరువులు, కుంటలు, గొలుసు చెరువుల సంప్రదాయానికి పొడగింపుగా తెలంగాణ ప్రతి ఊళ్ళోనూ చెర్లు, కుంటలు తవ్వించారు నైజాం నవాబులు.
స్వాతంత్య్రానంతర కాలంనాటికే హైదరాబాద్ మహానగరం భారతదేశంలోని ఐదు మహానగరాల్లో ఒకటి. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడటానికి అనంతగిరి నుంచి నల్గొండ జిల్లా వరకు హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహిస్తుంది మూసీ. నగరం నిండా చెరువులు, కుంటలు, పార్కులు, చెట్లు చేమలతో, పూలతోటలతో ప్రకృతిమాతకు ముద్దుబిడ్డలా ఉండేది. మూసీనిండా స్వచ్ఛమైన జలం ఉండటం వల్ల భూగర్భజలాలు పైపైన్నే ఉండేవి. దీంతో హైదరాబాద్ ఉష్ణోగ్రత సమశీతలంగా ఉండేది. హైదరాబాద్ వీధులవెంట నడుస్తుంటే హాయిగా ఉండేది.
కేసీఆర్ హయాంలో ఆక్రమణలు
తెలంగాణ వచ్చిన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెరువుల్లోనే ఫాంహౌస్‌లు, భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూములు, చెర్లు, కుంటల్లో నిర్మాణాలు లక్షల సంఖ్యలో పెరిగాయి. హైదరాబాద్ మరింత కాలుష్య కాసారమైంది. నాలాలకడ్డంగా పర్మిషన్ లేకుండా కట్టడాలు కట్టడం, భూబకాసుర చర్యలు అపరిమితంగా పెరిగాయి. చట్టం, పాలన, నియమాలు అనేవే లేకుండా రియల్‌ఎస్టేట్ దందా అక్రమార్జనాపరులను బిలియనీర్లుగా చేసింది.
వర్షం పడ్డరోజు ఆఫీసుకెళ్ళిన, పనిలో కెళ్ళిన మనిషి ఇంటికెళ్ళడానికి నాలుగైదు గంటలు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇండ్లలోకి, అపార్ట్‌మెంట్లలోకి నీరు వచ్చి ప్రజల బతుకులను అతలాకుతలం చేసే పరిస్థితులున్నాయి. ప్రకృతి విధ్వంసం, భూ ఆక్రమణలు, చెరువులు, కుంటలనేవి పూర్తిగా మాయమయ్యే పరిస్థితులొచ్చాయి. వీటన్నిటి ఫలితంగా భూగర్భజలాలు అడుగంటి భూతాపం పెరిగింది.
గ్లోబల్ వామింగ్ వల్ల, ప్రకృతి విధ్వంసం వల్ల మానవజాతికి జరుగుతున్న ప్రమాదమేంటో స్టీఫెన్ హాకింగ్ లాంటి భౌతికశాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చే
శారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ భూగోళంపై మానవజాతి, జీవరాశులు అంతరించిపోయే ప్రమాదముందని, మనిషి స్పెసిస్ మిగలాలంటే త్వరలో మనిషి మరో గ్రహాన్ని వెతుక్కోవాలని తేల్చేశాడు. మనిషికి నివాసయోగ్యమైన మరో గ్రహం దొరకడం సాధ్యం కాదనీ చెప్పాడు.
-
ప్రకృతి పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం
ప్రకృతి పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యంగా పాలకులు పాలన సాగిస్తే తప్ప మానవజాతి మనుగడ కొనసాగదు. ఈ విషయాన్ని బాగా గుర్తెరిగిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ప్రకృతిపరంగానూ, నివాసయోగ్యపరంగానూ విధ్వంసమవుతున్న హైదరాబాద్ మహానగరానికి పూర్వపు ప్రకృతి సౌందర్యం తీసుకు రావడానికి ఉద్దేశించిన కార్యక్రమమే మూసీ సుందరీ కరణ. చెరువులు, కుంటలు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అక్రమ కట్టడాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారిని సరిచేయడానికే హైడ్రాచట్టం చేయడం.
మూసీనది ప్రక్షాళన చేయడంలో, హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు పరిరక్షణ విషయంలో సామాన్యుడికి, మధ్యతర గతి వాడికి నష్టం జరగకూడదు. అమ్మినవాడు లేదా బిల్డర్ ఆ భూమిని అక్రమంగానే సంపాదించుకొని ఉండవచ్చు. అది బఫర్ జోన్‌లోనో, ఎఫ్‌టీఎల్‌లోనో ఉండవచ్చు. కానీ, వాటిని కూల్చి వేస్తే నష్టబోయేది ఎవరు? చెరువులోనో, నాలాలకు అడ్డంగానో, ప్రవాహానికి అడ్డంగానో ఉన్నవాటిని మాత్రమే తీసేయాలి. ఇండ్లు కోల్పోయేవారికి మరోచోట స్థలం లేదా ఇల్లు ధర చెల్లించిన తర్వాతే వీటిని కూల్చేయాలి. ఇప్పటికే కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం హర్షణీయం.
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూంల ఇండ్లు ఇవ్వడం, ఉపాధి కల్పించడం ప్రభుత్వం చేస్తున్న మానవీయమైన చర్య. అదే విధానాన్ని తప్పనిసరిగా కూల్చాల్సిన పర్మిషన్ ఉన్న కట్టడాల విషయంలోనూ పాటించడం ఉత్తమం. ఏదేమైనా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే కూల్చివేతలు చేయాలి. పర్మిషన్ ఉన్నవారి ఇండ్ల జోలికిపోమని సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం హర్షదాయకం. నెహ్రూ అనేక భారీ పరిశ్రమలు, నీటి ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు కట్టి నవభారత నిర్మాణం చేశాడు.
ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, బ్యాంకుల జాతీయీకరణ, అణుబాంబు ప్రయోగాలు లాంటి అనేక పనులు చేసినది. రాజీవ్‌గాంధీ రాజీవ్ గృహకల్ప, ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి దేశాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. కాంగ్రెస్ ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తే.. బీజేపీ, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తుల పక్షాన నిలిచాయి.
కాంగ్రెస్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడుగా రేవంత్‌రెడ్డి స్వల్పకాలంలోనే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు, చాలావరకు హామీలు అమలుచేసి ప్రకృతి సంరక్షణ ఉద్యమంతో ముందుకెళ్తున్నాడు. ఏదేమైనా మూసీ సుందరీకరణ, హైడ్రా చట్టంతో చెరువుల సంరక్షణ..ప్రకృతి సంరక్షణ కేంద్రంగా ఒక్క సామాన్యుడు కూడా కంటతడి పెట్టకుండా కొనసాగాలి. మూసీ పునరుజ్జీవనం, చెరువుల సంరక్షణను ఆహ్వానిద్దాం.
– డా. కాలువ మల్లయ్య–