యాక్సిడెంట్ల నివారణకు ‘కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్’

యాక్సిడెంట్ల నివారణకు ‘కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్’
  • స్కూళ్లలో ట్రాఫిక్ అవేర్నెస్​ పార్క్​లు ఏర్పాటు చేస్తం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి స్కూళ్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచే వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ​తెలిపారు. 80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. 

సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురువారెడ్డికి చెందిన సర్వేజన ఫౌండేషన్ తో కలిసి రవాణా శాఖ ‘కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్’ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. యాక్సిడెంట్ల నివారణపై సోమవారం సెక్రటేరియెట్ లో రవాణాశాఖ అధికారులు, సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురువారెడ్డికి చెందిన సర్వేజన ఫౌండేషన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 

2023లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 1లక్షా 73 వేల మంది మరణించారని ఇందులో 45 శాతం మంది 35 ఏండ్ల లోపు వారే ఉన్నారని మంత్రి తెలిపారు. అలాగే 44 శాతం మరణాలు ద్విచక్ర వాహన ప్రమాదాల్లోనే నమోదైనట్టు చెప్పారు. 80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. 

సర్వేజన ఫౌండేషన్, యునిసెఫ్ రవాణా విభాగంతో కలిసి రాష్ట్రంలోని ప్రతి స్కూళ్లో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే ‘కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్’ కింద కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకున్న వారికి డ్రైవింగ్ ఎడ్యూకేషన్​కు సంబంధించి మూడు గంటల వీడియోలు చూపించడం ద్వారా అవగాహన కల్పిస్తారు.