
ప్రపంచ రాజకీయ చరిత్రలో ఓటు హక్కు గొప్ప విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మన దేశంలో ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే అవకాశం పౌరులందరికీ కల్పించింది.
ఓటు రూపంలో భవిష్యత్తుకు మనమే బాట వేసుకునే రాజ్యాంగం కల్పించింది. నిన్న జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఓటు వేయడంలో బాగా ఆసక్తి చూపినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండడమే అందుకు కారణమనే వారు లేకపోలేదు. అయినా ఓటు వేయడం అనేది దేశ ప్రజాస్వామ్యానికి కీలకాంశం. లోక్‌సభ, శాసన సభల సాధారణ ఎన్నికల్లో ఇప్పటికీ ప్రజలు మూడో వంతు ఓటు వేయడం లేదనేదే అసలు చర్చ.
ఓటు హక్కు వినియోగంపై నిర్లక్ష్యం
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు పోలింగ్ శాతం పెంచడంలో విఫలమవుతున్నాయి. ఓటర్లలో 3వ వంతు పోలింగ్‌కు దూరంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది. గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో 3వ వంతు ఓటర్లు పోలింగుకు దూరంగా ఉన్నారని ఎన్నికల కమీషన్ పేర్కోవడం. దశాబ్దాలుగా దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య క పోవడం శోచనీయం.
అందుకు ఓటర్ల నిర్లక్ష్యం కొంత కారణమే అయినా.. ఓటరు జాబితాలు సైతం తప్పుల తడకలుగా ఉండటం రెండో కారణం. ఓటరు లిస్టుల తప్పుల తడకలపై ఈసీ మరింత దృష్టి పెట్టాలి. ఓటర్ల పోలింగ్ శాతాన్ని 75 లెక్కించేందుకు ఎన్నికల కమీషన్ కసరత్తు చేస్తోంది.
2014లో దేశంలో నమోదైన ఓటర్ల సంఖ్య 83.4 కోట్లు, పోలింగ్ శాతం 66.44. 2019లో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లు, పోలింగ్ శాతం 67.4. శాతం మించలేదు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 30 కోట్ల మంది పోలింగ్ బూత్‌కు వెళ్లలేదని, ఓటు హక్కు వినియోగించుకోలేదని ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. పట్టణ, నగర ప్రజలు, యువకులు, విద్యావంతులు, వలస కార్మికులు ఓటువేయని వారిలో ఉన్నారని తేలింది.
రిమోట్ ఓటింగ్ విధానం
స్వరాష్ట్రంలో ఓటరుగా నమోదైనవారు వివిధ కారణాల వల్ల వేరువేరు చోట్లకు వలస వెళ్లినప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే స్థితిలో లేనప్పుడు, వారి కోసం రిమోట్ ఓటింగ్ విధానం నూతన సాంకేతికతను ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. వినూత్నమైన కమ్యూనికేషన్ వ్యూహాల మీద ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టింది.
రిమోట్ ఓటింగ్ విధానం మీద దేశంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీల ఏకాభిప్రాయం కావాలి. ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన సంస్కరణలకు, ఇచ్చిన సూచనలకు రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఓటింగ్ తప్పనిసరి చేయాలి
ప్రభుత్వం నిర్బంధ ఓటింగ్ విధానం అమల్లోకి తేవాలి. అందుకు అవసరమయ్యే బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టి సమగ్ర ఎన్ని కల చట్టాలను రూపొందించాలి. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొత్తం ఓటర్లలో 90 శాతం ఓటింగ్ జరిగితే దేశంలో మరింత సుపరిపాలనకు అవకాశం ఉంటుంది.
మీడియా, టీవీ, సినిమా, ప్రసార సాధనాలు ఓటుహక్కు వినియోగం, ఓటు విలువ ఓటింగ్ విధానం పట్ల ప్రచారం చేయాలి. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధిగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బలమైన ప్రజా స్వామ్య వ్యవస్థలో ప్రగతి, సంక్షేమం సిద్ధించి దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమౌతుంది.
- నేదునూరి కనకయ్య-