భోపాల్: నర్మదా నదిని పరిరక్షించేందుకు వీలుగా తనకు హెలికాప్టర్ ఇవ్వాలని నామ్‌దేవ్ దాస్ త్యాగి మధ్యప్రదేశ్ సర్కార్‌ను కోరారు. కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధిపొందిన త్యాగి నర్మదా రివర్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈమేరకు విజ్ఞప్తి చేశారు. నది వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వీలుగా వారం రోజుల్లో హెలికాప్టర్‌తనకు ఇవ్వాలన్నారు. త్యాగిని కమల్‌నాథ్ సర్కార్ ఈ ఏడాది మార్చిలో నర్మదా ట్రస్ట్ బోర్డ్‌కు చైర్మన్‌గా నియమించినా ఇంతవరకు మంత్రి హోదా ఇవ్వలేదు. ఆయన మొదట్లో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉండేవారు.
నర్మదా నదిని పరిశుభ్రం చేసే లక్ష్యంతో ఏర్పాటుచేసిన పేనల్‌కు చైర్మన్‌గా నియమించి, బీజేపీ ప్రభుత్వం త్యాగికి మంత్రి హోదా ఇచ్చారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ సర్కార్‌కు దూరమై కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. నర్మదా నదిలో ఇసుక అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు చౌహాన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం, భోపాల్ కాంగ్రెస్ కేండిడేట్ దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం కంప్యూటర్ బాబా యాగాలు చేశారని వార్తలొచ్చాయి.