
మెదక్, చిన్నశంకరంపేట, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో మళ్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొదలుకానుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద సెలెక్ట్ చేసిన జడ్పీ హైస్కూల్స్, కేజీబీవీలు, మాడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్తోపాటు, ఎంఆర్సీలకు సైతం కంప్యూటర్లు వస్తున్నాయి. గవర్నమెంట్స్కూళ్లలో ఫ్రీగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తే ఆయా స్కూళ్లలో చదువుకునే వేలాది మంది పేద విద్యార్థులకు మేలు కలుగనుంది.
2006లోనే కేంద్ర ప్రభుత్వం నిట్ప్రోగ్రాం ద్వారా హైస్కూళ్లలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ప్రవేశ పెట్టింది. అప్పట్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు సమకూర్చారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఇన్స్ట్రక్టర్ను నియమించి స్టూడెంట్స్కు కంప్యూటర్ శిక్షణ ఇచ్చారు. అయితే నిట్ ప్రాజెక్ట్గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పునరుద్ధరించలేదు.
దీంతో స్టూడెంట్స్ కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు. ఎనిమిదేళ్ల కిందట కంప్యూటర్ శిక్షణ నిలిచిపోగా వినియోగంలో లేక కంప్యూటర్ ల్యాబ్లు వృథాగా మారాయి. ఒకటి, రెండు కంప్యూటర్లను స్కూల్ అవసరాల కోసం వినియోగించుకుంటుండగా రక్షణ లేక పలు స్కూళ్లలో నుంచి కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. మరికొన్నింటిని హెచ్ఎంలు, టీచర్లుతమ ఇళ్లలో తీసుకెళ్లి పెట్టుకున్నారు.
ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో కంప్యూటర్ విద్యను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్కూళ్లతో పాటు విద్యాభివృద్ధి కోసం అమలవుతున్న వివిధ పథకాల వివరాల నమోదు కోసం మండల రీసోర్స్సెంటర్లకు (ఎంఆర్సీ) సైతం కంప్యూటర్లు సమకూరుస్తోంది.
కంప్యూటర్లు, మెటీరియల్ సరఫరా
పాత మండలాల ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని 467 మండల్ రీసోర్స్ సెంటర్స్లకు, ఆయా మండలాల్లోని సెలెక్ట్ చేసిన జడ్పీ హైస్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, సోషల్వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్స్కూల్స్ కలిపి మొత్తం1,902 హైస్కూళ్లకు కంప్యూటర్లు, నెట్వర్కింగ్, ఎలక్ట్రికల్ మెటీరియల్మంజూరయ్యాయి.
జిల్లా కేంద్రాలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి రాగా వాటిని జిల్లా పరిధిలోని ఎంఆర్సీలు, ఎంపికైన స్కూళ్లకు చేరవేస్తున్నారు. 6 కంప్యూటర్లతో పాటు ఒక ప్రింటర్, ఒక 2 కేవీఏ యూపీఎస్, ఎం.ఎస్. ఆఫీస్ సాఫ్ట్వేర్, స్విచ్ బోర్డులు, కేబుల్స్, ఎంసీబీలు తదితర మెటీరియల్ సరఫరా అయ్యాయి. త్వరలోనే వాటిని స్కూళ్లలో అమర్చి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రారంభించనున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి
గతంలో డీసీఏ, పీజీడీసీఏ వంటి కంప్యూటర్ కోర్సులు చేసిన వారిని ఇన్స్ట్రక్టర్లుగా నియమించారు. నిట్ ప్రోగ్రాం పునరుద్ధరించకపోవడంతో ఆయా స్కూళ్లలో పనిచేసిన కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు సర్వ శిక్ష అభియాన్ కింద మళ్లీ కంప్యూటర్ఎడ్యుకేషన్ ప్రారంభం కానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,902 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.