గవర్నమెంట్ పాఠశాలల్లో అటకెక్కిన కంప్యూటర్ విద్య

గవర్నమెంట్ పాఠశాలల్లో అటకెక్కిన కంప్యూటర్ విద్య
  • సర్కారు బడుల్లో మూలకుపడ్డ కంప్యూటర్లు
  • అడవి బిడ్డలకు అందని సాంకేతిక విద్య
  • పట్టించుకోని ఆఫీసర్లు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లాలోని గవర్నమెంట్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కెంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉన్నత, ప్రాథమికోన్నత స్కూళ్లకు ప్రభుత్వం గతంలో కంప్యూటర్లను అందజేసింది. కొద్దిరోజులు సక్రమంగానే సాగిన కంప్యూటర్ విద్య తర్వాత అటకెక్కింది. నిర్వహణ లేక అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివాసీ జిల్లాని స్టూడెంట్లకు సాంకేతిక విద్య దూరమైంది. ఏండ్ల నుంచి ఆయా పాఠశాలల్లో కంప్యూటర్లు మూలకుపడ్డాయి.

2008 లో షురూ.. ఆపై బంద్​

గవర్నమెంట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంలో 2008లో నాటి గవర్నమెంట్ కంప్యూటర్ విద్యను షురూ చేసింది. లక్షల రూపాయల ఖర్చుచేసి కంప్యూటర్లు కొనుగోలు చేసి జిల్లాలోని 84 స్కూళ్లకు పంపిణీ చేశారు. ఒక్కో స్కూల్ కు 11 కంప్యూటర్లను అందజేశారు. కంప్యూటర్ బోధన చేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసే బాధ్యతలను ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. 2013లో బోధనా సిబ్బంది ఒప్పందం ముగియడంతో కంప్యూటర్ విద్య బోధించేవారు కరువయ్యారు. కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో నిరుపేద స్టూడెంట్లకు సాంకేతిక విద్య అందకుండాపోతోంది. దీంతో ఆ కంప్యూటర్లు మూలకుపడ్డాయి. ఫలితంగా స్టూడెంట్లు సాంకేతిక పరిజ్ఞానం పొందలేకపోతున్నారు.

  • ఏజెన్సీ ప్రాంతంలోని కెరమెరి మండల కేంద్రంలో జడ్పీ హెచ్​ఎస్​లో 11 కంప్యూటర్లు ఉండగా ప్రస్తుతం కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. ఒ కటి ఆఫీస్ వర్క్ కోసం, మరోటి ల్యాబ్ కోసం వాడుతున్నారు. మిగతా 9 కంప్యూటర్లు మూలకుపడ్డాయి. ఈ స్కూల్ లో చదువుతున్న 475 మంది విద్యార్థులు కంప్యూటర్ శిక్షణకు నోచుకోవడం లేదు.
  • ఎడ్యుకామ్ సంస్థ దహెగాం మండలంలోని హై స్కూల్స్ కు ఇచ్చిన 55 కంప్యూటర్లు 2012 నుంచి పనిచేయడం లేదు. కరోనా టైమ్​లో స్థానిక కేజీబీవీలో ఉన్న కంప్యూటర్లను దొంగలెత్తుకుపోయారు. 2023 మార్చ్ లో ఎంఆర్సీలోని 2 కంప్యూటర్లు కూడా చోరీకి గురయ్యాయి. కొత్త కంప్యూటర్లు పంపిణీ చేసి ట్రైనర్లను నియమించి సాంకేతిక విద్యను అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.

కంప్యూటర్ నేర్పిస్తలేరు

నేను దహెగాం గవర్నమెంట్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నా. మాకు కంప్యూటర్ క్లాసులు చెప్తలేరు. స్కూల్ కు ఇచ్చిన కంప్యూటర్లు ఖరాబ్ అయితే మూలకు పడేసిండ్రు. వాటిని రిపేర్ చేపిస్తలేరు. కంప్యూటర్ ట్రైనర్ కూడా లేరు. మాకు కంప్యూటర్ క్లాసులు జరిగేలా చర్యలు తీసుకోవాలె.

జాబరి మానస, విద్యార్థిని, దహెగాం

స్టూడెంట్లకు సాంకేతిక విద్య అందేలా చర్యలు

ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఇచ్చిన కంప్యూటర్లు పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించి స్టూడెంట్లకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం.

అశోక్, డీఈవో, ఆసిఫాబాద్