తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇరిగేషన్ ఈఈ ఆఫీసులో ఆదివారం దొంగలు పడ్డారు. విలు వైన ఫైల్స్ ఉన్న కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. ఆదివారం కావడంతో ఎల్ఎండీ కాలనీలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరు. నైట్ డ్యూటీ కోసం సాయంత్రం వాచ్‌మన్ కనకయ్య ఆఫీసుకు చేరుకునే సరికి.. తాళాలు పగులగొట్టి, తలుపులు తీసి ఉన్నాయి.
దీంతో కనకయ్య వెంటనే ఆఫీస్ సూపరింటెండెంట్ అంజిరెడ్డికి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. తర్వాత ఇరిగేషన్ ఉద్యోగులు కూడా ఆఫీసుకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి పరిశీలించగా 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆఫీసులో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, విలువైన ఫైల్స్ మాయం కావ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీకి గురైన కంప్యూటర్లలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కీలకమైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించిన డేటాతో పా టు క్యాంపు క్వార్టర్లు, అటెండర్లు, అభివృద్ధి పను లకు సంబంధించిన డేటా ఉన్నట్లు తెలుస్తున్నది. బీరువాను పగులగొట్టి వివిధ ఫైళ్లను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆఫీస్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు.