వైన్ షాప్ తొలగించాలని అంబాలలో ఆందోళన

కమలాపూర్, వెలుగు: వైన్​షాపును తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. కమలాపూర్ మండలం అంబాలలోని శ్రీవినాయక వైన్ షాప్ ను అక్కడి నుంచి తరలించాలంటూ శుక్రవారం షాపు ముందు బైఠాయించారు. వైన్​షాపు కు వచ్చే తాగుబోతులతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. 

డెయిలీ అర్ధరాత్రి వరకు మందు బాబులు హల్​చల్​ చేస్తున్నారని, పరిసర ప్రాంతాలు కంపు చేస్తున్నారని మండిపడ్డారు. తొలగించాలని వారం కింద ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. దీంతో రెండోసారి నిరసనకు దిగామన్నారు. 

అధికారులు స్పందించి తరలించకపోతే సామూహికంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కమలాపూర్ పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.