ఆదివాసీ బంధు ఇవ్వాలంటూ ఆదిలాబాద్ లో ఆందోళన


 

  •     కుమ్రంభీం చౌక్‌‌లో రాస్తారోకో.. కలెక్టరేట్ ముట్టడికి యత్నం
  •     వారిని కలవడానికి నిరాకరించిన కలెక్టర్
  •     అడిషనల్ కలెక్టర్‌‌‌‌కు 5 వేల అప్లికేషన్ల అందజేత

దళిత బంధు మాదిరే ఆదివాసీ బంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జైనూర్, కెరమెరితోపాటు గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్​హత్నూర్, తలమడుగు, తాంసి, బోథ్ మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో రోడ్డెక్కారు. తమ నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.దళిత బంధు మాదిరే ఆదివాసీ బంధు పెట్టి, తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని గోండు, కొలాం జాతులను ఆదుకోవాలంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డెక్కారు. తొలుత కుమ్రంభీం చౌక్​లో రాస్తారోకో చేసి.. తర్వాత కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వారిని కలవడానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ నిరాకరించడంతో.. కలెక్టర్ చౌక్​ను దిగ్బంధించారు. అప్పటికీ కలెక్టర్ దిగిరాకపోవడంతో సాయంత్రం అడిషనల్ కలెక్టర్ నటరాజన్​కు 5 వేల అప్లికేషన్లు అందజేశారు.
వేలాదిగా వచ్చిన ఆదివాసీలు
ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జైనూర్, కెరమెరితోపాటు గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్​హత్నూర్, తలమడుగు, తాంసి, బోథ్ మండలాల నుంచి వేలాదిగా ఆదివాసీలు సోమవారం ఉదయమే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌‌లోకి వెళ్లి కలెక్టర్​కు అప్లికేషన్లు ఇస్తామని ఆదివాసీ నేతలు పట్టుబట్టారు. అందుకు నిరాకరించిన పోలీసులు.. లోపలికి వెళ్లనివ్వలేదు. దాంతో ఆదివాసీలంతా అక్కడి నుంచి కలెక్టర్ చౌక్​కు వెళ్లి అక్కడ 3గంటలు రహదారిని దిగ్బంధించారు. అడిషనల్​ కలెక్టర్ నటరాజన్ వచ్చి అప్లికేషన్లు స్వీకరించారు. ఆదివాసీ బంధు పెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని, లంబాడాలకు ఎస్టీ హోదా రద్దు చేయాలని  ఆదివాసీలు కోరారు. తాము సాగుచేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలివ్వాలని, ట్రైబల్ వర్సిటీని ఆదిలాబాద్‌‌లోనే ఏర్పాటు చేయాలన్నారు. భూమిలేని ప్రతి ఆదివాసీకి మూడెకరాల భూమి ఇవ్వాలని, స్పెషల్ డీఎస్సీ పెట్టి ఆదివాసీలకు ఉద్యోగాలు కల్పించాలని.. డబుల్ బెడ్ రూమ్​లు కట్టి ఇవ్వాలని కోరారు.