- ఇంటికి తాళం వేసి పరారైన యువకుడి కుటుంబం
రాయపర్తి, వెలుగు : తాను ప్రేమించిన యువకుడు వివాహానికి ఒప్పుకోకపోవడంతో అతని ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గొప్యా తండాలో జరిగింది. తండా వాసుల కథనం ప్రకారం సూక్య తండాకు చెందిన సావిత్రికి ఏడాదిన్నర కిందట సమీపంలోని గొప్యా తండాకు చెందిన భూక్య ప్రతాప్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో సావిత్రి గర్భం దాల్చగా ప్రతాప్ అబార్షన్ చేయించాడు.
తనను వివాహం చేసుకోవాలని యువతి కోరుతున్నా అతను పట్టించుకోవడం లేదు. దీంతో బాధితురాలు ప్రతాప్ పై ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా కూడా అతను పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాడు. దీంతో గురువారం అతని ఇంటి ముందు తన కుటుంబ సభ్యులతో బైఠాయించి ఆందోళనకు దిగింది. దీంతో ప్రతాప్ సహా అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని సావిత్రి పేర్కొంది. అతనితో వివాహం జరిపించి న్యాయం చెయ్యాలని కోరుతున్నది.