అసెంబ్లీలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

అసెంబ్లీలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
  • సబితపై రేవంత్ ​వ్యాఖ్యలకు నిరసనగా సభ బయట ఆందోళన.. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభలో ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వెల్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందే బైఠాయించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనతో సభలో మార్షల్స్‌‌‌‌‌‌‌‌ను మోహరించారు. దీంతో సభలో నుంచి బయటకు వచ్చి అసెంబ్లీలోని సీఎం చాంబర్ ఎదుట బైఠాయించారు. అక్కడి నుంచి అసెంబ్లీ గేట్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ పోర్టికో వద్ద కాసేపు నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు అక్కడే కూర్చుంటామని పట్టుబట్టడంతో అసెంబ్లీ మార్షల్స్‌‌‌‌‌‌‌‌, పోలీసులు వారిని పోలీస్‌‌‌‌‌‌‌‌ వ్యాన్‌‌‌‌‌‌‌‌లోకి ఎక్కించి.. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సభలో సీఎం, డిప్యూటీ సీఎం మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి  సీఎం, డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘మహిళా నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటు. 

కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు, మొత్తం మహిళలపై వారికున్న చులకన భావాన్ని తెలియజేస్తున్నాయి. మహిళలంతా కాంగ్రెస్ నేతల తీరును గమనిస్తున్నారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం”అని కేటీఆర్ అన్నారు. ఇదే అంశంపై ఎమ్మెల్యేలు జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. మహిళా ఎమ్మెల్యేల ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.