
- ఆఫీసర్లు రాకుంటే...సమస్యలు ఎవరికి చెప్పాలె ?
- భూపాలపల్లి జడ్పీ మీటింగ్‌లో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
- మీటింగ్‌కు హాజరుకానీ కలెక్టర్, వివిధ శాఖల ఆఫీసర్లు
- సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జడ్పీ మీటింగ్‌కు కలెక్టర్, జిల్లా స్థాయి ఆఫీసర్లే రాకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ జడ్పీటీసీ, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి అధ్యక్షతన శుక్రవారం ఇల్లందు క్లబ్‌హౌజ్‌లో జడ్పీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దివాకర్, జడ్పీ సీఈవో రఘువరన్ మాత్రమే హాజరయ్యారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రాతో పాటు వివిధ శాఖల ఆఫీసర్లు మీటింగ్‌కు హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆందోళనకు దిగారు.
15 అంశాలపైనే రివ్యూ
జడ్పీ మీటింగ్‌లో మొత్తం 28 అంశాలపై రివ్యూ చేయాల్సి ఉండగా 15 అంశాలపైనే సమీక్ష నిర్వహించి మమ అనిపించారు. మిగతా అంశాలపై సమీక్ష జరపాల్సి ఉన్నా ఆయా శాఖల ఆఫీసర్లు మీటింగ్‌కు హాజరుకాలేదు. మీటింగ్ ప్రారంభం కాగానే జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు సరిగా అందడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చారు. పీహెచ్‌సీల్లో హాస్పిటల్స్‌లో సరిపడా డాక్టర్లు లేకపోవడంతో వైద్యసేవలు సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవపూర్, కాటారం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవినీతి విషయంపై గత కౌన్సిల్‌లో చర్చించినా ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ వెంటనే విచారణ చేసి రిపోర్టు తయాలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
వడ్లు కొంటరా.. కొనరా ?
కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల నీట మునిగిన పొలాల్లో ఆలస్యంగా నాట్లు పడ్డాయని, ఇప్పుడు ఆ వడ్లను ప్రభుత్వం కొంటుందా ? కొనదా అని మహదేవ్‌పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ ప్రశ్నించారు. వరికోతలు లేట్ కావడం వల్ల వడ్లు ప్రస్తుతం కల్లాల్లోనే ఉన్నాయన్నారు. రూ. లక్షలోపు లోన్లను మాఫీ చేయకపోవడంతో రైతుల వడ్ల పైసలు, పింఛన్ డబ్బులను బ్యాంకర్లు ఇవ్వడం లేదని మల్హర్ ఎంపీపీ మలహర్‌రావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలలోని ఎస్సారెస్పీ కాల్వలకు నీరు రావడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, నీరు విడుదల చేసేలా చూడాలని పలువురు కోరారు.