ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి.. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన

 అదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మేకు దిగారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకవచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ఐదు డిపోల్లో సుమారు 2 వందల అద్దె బస్సులు పార్కింగ్ కే పరిమితమయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు కూడా తెలపడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

హిట్ అండ్ రన్ అంటే ఏమిటి..

  భారత న్యాయ సంహిత చట్టం నిబంధన ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసు అంటే.. ఎవరైనా డ్రైవర్ యాక్సిడెంట్ చేసి పారిపోతే అతనికి పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు ఫైన్ వేయనున్నట్లు ఈ చట్టంలో ఉంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత దాని గురించి పోలీసులకు చెప్పకుండా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని చేర్చారు. 

అయితే ఈ కొత్త నిబంధనపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు తెలిపాయి. మరి కేంద్ర ఈ చట్టాన్ని అమలులో ఉంచుతుందా లేదా అనేది వేచి చూడాలి.