జడ్చర్ల టౌన్, వెలుగు: నాణ్యమైన వేరుశనగ పంటకు వ్యాపారులు తక్కువ ధర పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. సరైన ధర ప్రకటించాలని మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా సగటున క్వింటాకు రూ. 4169 మాత్రమే ఇస్తున్నారని, అత్యధిక ధర అయిన రూ.7155 ను కొంతమంది రైతులకే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పంటకు కనీసం క్వింటాలుకు రూ. 5500 కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వ్యాపారుల తీరును నిరసిస్తూ మార్కెట్‌లో విఠలయ్య కమీషన్ మర్చంట్‌కు చెందిన కాంటాను ధ్వంసం చేశారు. హామాలీలతో కూడా గొడవకు దిగడంతో మార్కెట్ యార్డులో పల్లి కొనుగోలు నిలిచిపోయింది. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన 5089 క్వింటాళ్ల వేరుశనగ పంట క్రయవిక్రయాలు జరపకుండా వ్యాపారులు నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసులు రైతులకు మద్దతు ధర విషయంలో నష్టం రానివ్వమని వ్యాపారులతో, రైతులతో చర్చలు జరిపారు. రూ.5000ల లోపు ధర వచ్చిన రైతులకు కొంత మేర ధర పెంచేలా వ్యాపారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. కాంటాను పగలగొట్టడంతో ఇటు వ్యాపారులు, హామాలీలతో గొడవ జరగడంతో హామాలీలు కార్యదర్శి శ్రీనివాసులుతో రాత్రి వరకు చర్చలు జరిపారు.