
- మోదెల నుంచి ముల్కల్ల వరకు గోదావరి తీరం వెంట సర్వే
- ముల్కల్ల వద్ద అలైన్మెంట్ మార్చడంతో భూబాధితుల ఆందోళన
- బడా వ్యక్తుల భూములు కాపాడేందుకేనని ఫైర్
- ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం వాగు పక్క నుంచే నిర్మించాలని డిమాండ్
మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మించనున్న ఎన్‌హెచ్ 63 అలైన్మెంట్ అనేక మలుపులు తిరుగుతోంది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం నుంచి ముల్కల్ల వరకు మొదట పొలాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు సర్వే చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తే విలువైన పంట పొలాలు పోతాయని రైతులు ఆందోళన చేయడం, బడ్జెట్ రీత్యా గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనను విరమించుకున్నారు.
రెండోసారి ప్రస్తుత హైవేనే ఫోర్ లేన్‌గా విస్తరించడానికి ప్రతిపాదనలు చేసి సర్వే చేశారు. అయితే, లక్సెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు రోడ్డు పక్కనున్న బిల్డింగులు పోతాయని స్థానికులు ఆందోళనకు దిగారు. మళ్లీ ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి తాజాగా గోదావరి తీరం వెంబడి నిర్మించడానికి అధికారులు సర్వే చేస్తున్నారు. మరోవైపు ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు ఫస్ట్ అలైన్మెంట్ మార్చి ప్రస్తుతం ప్రైవేట్ భూముల్లో సర్వే చేస్తుండడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బడా వ్యక్తుల భూములను కాపాడేందుకే అలైన్మెంట్ మార్చి తమ భూముల్లో సర్వే చేస్తున్నారని ఎన్హెచ్ఏఐ అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. కొద్దిరోజులుగా సర్వేను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికి ఏడేండ్లు కావస్తున్నా హైవే పనులు అడుగు ముందుకు సాగకపోవడంతో అసలు ఈ హైవే నిర్మాణం పూర్తవుతుందా? కాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్మూర్ నుంచి మంచిర్యాల
ఎన్‌హెచ్63 నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఛత్తీస్‌గఢ్ లోని జగ్దల్ పూర్ వరకు విస్తరించి ఉండగా, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్‌లేన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో 160 కిలోమీటర్ల పొడవునా పొలాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు నాలుగేండ్ల కిందట సర్వే చేసి అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే విలువైన పంట పొలాలను ఇవ్వబోమని రైతులు ఆందోళన చేశారు. మరోవైపు గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో దానిని తాత్కాలికంగా పక్కనపెట్టారు. రెండో ప్రతిపాదనగా ప్రస్తుతం ఉన్న రోడ్డునే ఫోర్ లేన్‌గా విస్తరించాలని నిర్ణయించి సర్వే చేసినా.. రోడ్డు పక్కనున్న విలువైన ఇండ్లు, భూములు కోల్పోతామని స్థానికులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రతిపాదనకూ బ్రేక్ పడింది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలం మోదెల నుంచి హాజీపూర్ మండలం ముల్కల్ల వరకు ఫోర్ లేన్ నిర్మాణం కోసం ఎన్హెచ్ఏఐ అధికారులు మూడో అలైన్‌మెంట్‌ను రెడీ చేస్తున్నారు. గోదావరి తీరం వెంట నిర్మించనున్న ఈ రోడ్డు కోసం జిల్లాలోని 17 రెవెన్యూ గ్రామాల నుంచి 574.31 హెక్టార్ల భూ సేకరణకు సర్వే చేపడుతున్నారు.
కొత్త అలైన్మెంట్తో ఆందోళన
మోదెల నుంచి ముల్కల్ల వాగు దాకా గోదావరి తీరం వెంట 500 మీటర్ల దూరం వరకు రూపొందించిన అలైన్మెంట్ ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు మళ్లీ మారింది. మొదటి అలైన్మెంట్ ప్రకారం ముల్కల్ల వాగు పక్క నుంచి రోడ్డు నిర్మించాల్సి ఉండగా, ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ మధ్య నుంచి కోట్ల విలువైన ప్రైవేట్ భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్ల మీదుగా వెళ్లనుంది. ఈ అలైన్‌మెంట్‌ను మార్చాలని నిరుడు భూ యజమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో పలువురు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి తమ గోడు విన్నవించారు. అలైన్మెంట్ మార్పుకు కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, తాజాగా అదే అలైన్ మెంట్ ప్రకారం సర్వే చేయడం, త్వరలోనే ఎన్హెచ్ఏఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో స్థానికులు మళ్లీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్హెచ్ఏఐ ఆఫీసు వద్ద ధర్నా చేయడంతో పాటు కలెక్టర్, ఆర్డీఓను కలిసి మొదటి అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హైవే పక్కనున్న భూములు ఎకరానికి రూ.3 కోట్లు పలుకుతున్నాయి. కానీ, ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం గజానికి రూ.700 మాత్రమే చెల్లిస్తుండడంతో భూ యజమానులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ నేపథ్యంలో ముల్కల్ల నుంచి కుర్మపల్లి ఎన్‌హెచ్ 363 వరకు ఫస్ట్ అలైన్మెంట్ ప్రకారం వాగు పక్క నుంచే ఫోర్‌లేన్ నిర్మాణం చేపట్టాలని భూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.