![హాస్టల్లో సౌలతులు కల్పించాలి.. నిజాం కాలేజీ పీజీ విద్యార్థినుల ఆందోళన](https://static.v6velugu.com/uploads/2023/12/concern-of-pg-students-of-nizam-college-to-provide-facilities-in-the-hostel_9EGKdcCv2b.jpg)
- రెండు గదుల్లో 70 మంది ఉంటున్నామని ఆవేదన
బషీర్ బాగ్, వెలుగు: తమ హాస్టల్లో సౌలతులు కల్పించాలని, మంచి ఫుడ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ నిజాం కాలేజీ పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి నిలు ఆందోళనకు దిగారు. సైఫాబాద్‌లోని సైన్స్ కాలేజీ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బషీర్‌బాగ్ చౌరస్తాలో బైఠాయించి విద్యార్థినులు నిరసన తెలిపారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు విద్యార్థినులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా.. వారిని పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. అంతకుముందు విద్యార్థినిలు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ చాంబర్ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో కాలేజీ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన చేపట్టారు.
పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. సైఫాబాద్ హాస్టల్లోని రెండు రూమ్స్‌లో 70 మంది ఉంటున్నామని చెప్పారు. కనీస వసతులు లేవన్నారు. తాగునీరు కూడా ఉండట్లేదన్నారు. బాత్రూంలు దారుణంగా ఉన్నాయని.. వంట సిబ్బంది లేక టిఫిన్స్, భోజనం తామే చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం చేసుకున్న టిఫిన్‌ను మధ్యాహ్నం లంచ్‌కు, రాత్రి భోజనానికి వాడుకోవాల్సి వస్తోందన్నారు. 20 రోజులుగా ప్రిన్సిపాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌తో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ నచ్చజెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.