సౌకర్యాలు లేవంటూ.. కేజీబీవీలో విద్యార్థుల ఆందోళన

కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ సప్తగిరి కాలనీలోని కేజీబీవీలో సరైన సౌకర్యాల్లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆదివారం ఆందోళనకు దిగారు. సమస్యలను పట్టించుకోవడం లేదని కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్రీలతను నిలదీశారు. స్కూల్‌‌లో కనీసం సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇటీవల ఆహారంలో పురుగులు వచ్చాయని, విషయం ఇన్‌‌చార్జి వార్డెన్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. 

నీటి సౌకర్యం సరిగా లేక  అమ్మాయిలు మూడు రోజులకు ఒకసారి స్నానం చేయాల్సి వస్తోందన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ ఐ లీడర్లు స్కూల్​వద్దకు చేరుకుని విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఎంఈవో మధుసూదన్ చారి అక్కడికి వచ్చి  ప్రిన్సిపాల్ శ్రీలతతో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఇన్ని సమస్యల మధ్య తమ పిల్లలను ఉంచేది లేదని ఇంటర్​ఫస్ట్​ఇయర్​చదువుతున్న 15 మంది విద్యార్థులను తల్లిదండ్రులు ఇండ్లకు తీసుకెళ్లారు. 

ఎంఈవో మాట్లాడుతూ స్కూల్‌‌లో బియ్యం అయిపోతే వేరే చోట నుంచి తెప్పించామని, ఆ ఒక్కరోజే అన్నంలో పురుగులు వచ్చాయన్నారు. దీంతో ఆ బియ్యం పక్కకు పెట్టి వేరే బియ్యం తీసుకొచ్చి అన్నం వండిపెడుతున్నామన్నారు. ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ టీచర్లు సరిగా పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులు ఎప్పుడూ తనకు చెప్పలేదన్నారు. సమస్యలుంటే నేరుగా తనను కలిసి చెప్పొచ్చన్నారు. దీంతో మిగిలిన వారు లోపలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకొని ఎంఈవో, ప్రిన్సిపాల్‌‌తో మాట్లాడారు.