మునుగోడు నియోజకవర్గం చండూర్ రిటర్నింగ్ ఆఫీసు దగ్గర ఉద్రికత్త ఏర్పడింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెంట్లకు కేటాయించడంపై ఆఫీసు ముందు టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రోడ్ రోలర్, డోజర్ సహా ఏడు గుర్తులు కేటాయించడవద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ వినతిని ఎన్నికల సంఘం పట్టించుకోలేదని నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ వద్దన్న గుర్తులను స్వతంత్రులకు కేటాయించామని ఈసీ చెబుతోంది. ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు నల్గొండ జిల్లా కలెక్టర్ వద్ద ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించినందుకు ధర్నా చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను హైకోర్ట్ వాయిదా వేసింది. పిటిషన్పై రేపు(మంగళవారం) విచారణ జరుపుతామని చెప్పింది. నిజానికి ఈ అంశంపై టీఆర్ఎస్ శనివారమే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇదేమంత అత్యవసరమైన కేసు కాదంటూ విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది.