600 మందిని నిండా ముంచేశారు.. RJ వెంచర్స్ రూ.150 కోట్ల భారీ స్కామ్

హైదరాబాద్ శివార్లలో అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని లక్షలు వసూలు చేసింది ఆర్జే వెంచర్స్. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పఠాన్ చెర్వు కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు. 2020 నుంచి ఇప్పటి దాకా 600 మంది దగ్గర నుంచి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్టించుకున్నారు. ఆర్జే వెంచర్స్ తీరా చూస్తే ఇప్పుడు బోర్డ్ తిప్పేశారని శుక్రవారం (నవంబర్ 22, 2024) బాధితులు బషీర్ బాగ్ లోని సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు. 

డబ్బులు కట్టినవారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి దాదాపు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు.. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆర్జే వెంచర్ బాధితులు వాపోతున్నారు.

ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని.. ఫిర్యాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో చేయాలని అధికారులు సూచించారు.